ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఆలిండియా ఇన్విటేషన్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ ఈనెల 6 నుంచి 14 వరకు నారాయణగూడలోని వైఎం సీఏలో నిర్వహిస్తున్నట్లు వైఎంసీఏ చైర్మన్ బి.జె.వినయ్ స్వరూప్ తెలిపారు. సెక్రటరీ లియోనార్డ్, కన్వీనర్ నార్మన్ ఐజాక్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.ఎస్.ప్రేమ్ కుమార్‌తో కలిసి వినయ్ వివరాలను వెల్లడించారు.
దాదాపు 40 మంది అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొనే ఈ టోర్నీలో తొలిసారిగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇంటర్ లాకింగ్ సర్ఫేస్ మ్యాట్‌లో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మహిళల విభాగంలో పోటీలు రౌండ్ రాబిన్ పద్ధతిలో 6 నుంచి 10 వరకు, పురుషుల విభాగంలో లీగ్ పద్ధతిలో 10 నుంచి 14 వరకు మ్యాచ్‌లు జరుగుతాయన్నారు. పురుషుల జట్టు విజేతకు రూ. 60 వేలు, రన్నరప్‌కు రూ. 40 వేలు, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 30 వేల చొప్పున నగదు బహుమతులను అందజేస్తారు. మహిళల విభాగంలో వరుసగా రూ. 50 వేలు, రూ. 30 వేలు, రూ. 20 వేల నగదు బహుమతులు ఇస్తారు.
మహిళల జట్లు: సౌత్ రైల్వే, ఈస్టర్న్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే, చత్తీస్‌గఢ్, కేరళ విద్యుత్ జట్లు; ఫురుషుల జట్లు: ఆర్మీ, ఓఎన్‌జీసీ, వైఎంసీఏ, కేరళ విద్యుత్ బోర్డు, ఏఓసీ, ఐఓబీ, ఆర్‌సీఎఫ్, కొచిన్ కస్టమ్స్.