
నాగ్‌పూర్: చాలా రోజుల తర్వాత జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ స్టార్ క్రీడాకారులతో కళకళలాడనుంది. అంతర్జాతీయస్థాయిలో మెరిపిస్తున్న భారత అగ్రశ్రేణి క్రీడాకారులందరూ గురువారం మొదలయ్యే ఈ ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నమెంట్‌లో బరిలోకి దిగనున్నారు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ పీవీ సింధు, 11వ ర్యాంకర్ సైనా నెహ్వాల్... పురుషుల సింగిల్స్‌లో డెన్మార్క్, ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ కిడాంబి శ్రీకాంత్, భమిడిపాటి సాయిప్రణీత్, హెచ్‌ఎస్ ప్రణయ్, అజయ్ జయరామ్, సమీర్ వర్మ, సౌరభ్ వర్మ, పారుపల్లి కశ్యప్ ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు. స్టార్ ఆటగాళ్లందరూ నేరుగా ప్రిక్వార్టర్ ఫైనల్ దశ నుంచి పోటీపడతారు. వారం రోజులపాటు జరిగిన ఈ టోర్నమెంట్‌లో 29 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల జట్ల నుంచి 400 మంది క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.
పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి; మనూ అత్రి–సుమీత్ రెడ్డి; అర్జున్–శ్లోక్ రామచంద్రన్ జోడీలకు... మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప; సంజన–ఆరతి; మేఘన–పూర్వీషా రామ్ జంటలకు... మిక్స్‌డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా; సుమీత్ రెడ్డి–అశ్విని పొన్నప్ప జోడీలకు నేరుగా క్వార్టర్ ఫైనల్లోకి చోటు కల్పించారు. మొత్తం రూ. 60 లక్షల ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు రూ. 2 లక్షల చొప్పున అందజేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment