నవజ్యోత్ కౌర్,సాక్షి మలిక్
బిష్‌కెక్ (కిర్గిస్తాన్): భారత మహిళా రెజ్లర్ నవజ్యోత్ కౌర్ కొత్త చరిత్ర లిఖించింది. ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం నెగ్గిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా గుర్తింపు పొందింది. శుక్రవారం జరిగిన మహిళల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగం ఫైనల్లో 28 ఏళ్ల నవజ్యోత్ కౌర్ 9–1తో మియు ఇమాయ్ (జపాన్)పై ఘనవిజయం సాధించింది. ఐదోసారి ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న నవజ్యోత్ పసిడి పతకం నెగ్గడం ఇదే తొలిసారి.
గతంలో ఆమెకు రజతం (2013లో), కాంస్యం (2011లో) లభించాయి. మరోవైపు సాక్షి మలిక్ 62 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని దక్కించుకుంది. తొలి రౌండ్‌లో సాక్షి చైనా రెజ్లర్ జియోజువాన్ లువో చేతిలో ఓడిపోయింది. లువో ఫైనల్‌కు చేరడంతో సాక్షికి కాంస్య పతకం కోసం నిర్వహించే ‘రెప్‌చేజ్’’ రౌండ్‌లో పోటీపడే అవకాశం దక్కింది. ‘రెప్‌చేజ్’ తొలి రౌండ్‌లో 10–0తో జియె చోయ్ (కొరి యా)ను ఓడించిన సాక్షి... కాంస్య పతక పోరులో 10–7తో కసిమోవా (కజకిస్తాన్)పై గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment