ప్రతి మ్యాచ్ మాకు సవాల్ లాంటిది..
మొహాలి: ఢిల్లీ డేర్ డేవిల్స్ ను చిత్తుచేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 9 లో తమ సెమీస్ ఆశలు సజీవంగా నిలుపుకుంది. జహీర్ ఖాన్ నేతృత్వంలోని డేర్ డెవిల్స్ పై 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం పంజాబ్ బౌలర్ సందీప్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నాడు. ఇక నుంచి తమ జట్టు ఇలాగే జోరును కొనసాగిస్తుందన్నాడు. టాప్ 4లో నిలిచి సెమీస్ ఆశల్ని నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తంచేశాడు. లీగ్ లో పోటీలో నిలవాలంటే ఇక ప్రతీ మ్యాచ్ తమకు సవాల్ లాంటిదేనని అభిప్రాయపడ్డాడు.
స్టోయినిస్ (44 బంతుల్లో 52; 3 ఫోర్లు, 2 సిక్సర్లు; 3/40) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పంజాబ్ గట్టెక్కింది. కోల్ కతా లో తమ జట్టు మంచి ప్రదర్శన చేసిందన్నాడు. ఇప్పుడు తాము మంచి కెప్టెన్ నేతృత్వంలో కొనసాగుతున్నామని, అతడికి బౌలర్లకు బంతి ఎప్పుడు ఇవ్వాలో తెలుసునని సందీప్ చెప్పుకొచ్చాడు. మిల్లర్ నుంచి పగ్గాలు చేపట్టిన తర్వాత మురళీ విజయ్ జట్టుకు రెండు విజయాలను అందించిన విషయం తెలిసిందే. మిల్లర్, మాక్స్ వెల్ ఇప్పుడు గాడిలో పడి పరుగుల వేట మొదలెట్టారని, బ్యాట్స్ మన్ ఏ స్థానాల్లో రావాలో కూడా విజయ్ కి అవగాహనా ఉందని కెప్టెన్ పై పంజాబ్ ఆటగాడు సందీప్ ప్రశంసలు కురిపించాడు.