
ధోనికి సరికొత్త సవాల్!
జింబాబ్వే పర్యటనలో భాగంగా మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని యువకులతో కూడిన భారత క్రికెట్ జట్టు కొత్త సవాల్ కు సిద్ధమైంది.
హరారే: జింబాబ్వే పర్యటనలో భాగంగా మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని యువకులతో కూడిన భారత క్రికెట్ జట్టు కొత్త సవాల్ కు సిద్ధమైంది. తన రిజర్వ్ బెంచ్ను పరీక్షించుకునే క్రమంలో జింబాబ్వే పర్యటనకు వెళ్లి న భారత జట్టు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ టూర్లో కెప్టెన్ ధోని మినహా దాదాపు అంతా కొత్త వారే కావడంతో భారత జట్టు ఎంతవరకూ రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రేపట్నుంచి ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది. భారత కాలమాన ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం గం.12.30 ని.లకు హరారే స్పోర్ట్స్ క్లబ్లో ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరుగునుంది.
అంతకుముందు వరుసగా 2013, 2015 సంవత్సరాల్లో జరిగిన వన్డే సిరీస్ల్లో జింబాబ్వేను భారత జట్టు క్లీన్స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. 2013 లో విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు 5-0 తో వన్డే సిరీస్ గెలిస్తే, 2015లో అజింక్యా రహానే సారథ్యంలోని టీమిండియా 3-0 తో సిరీస్ను వైట్ వాష్ చేసింది. అయితే తాజా పర్యటనలో ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడంతో భారత జట్టుకు కఠిన పరీక్ష తప్పకపోవచ్చు. అటు జింబాబ్వే పసికూనగా కనిపిస్తున్నా, సంచలన విజయాలు నమోదు చేయడంలో ఆ జట్టు ఎప్పుడూ ముందుంటుంది. దీంతో ధోని అండ్ గ్యాంగ్ ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా ఆడితేనే జింబాబ్వేపై విజయాలు సాధ్యమవుతాయి. ప్రస్తుత భారత జట్టు ఐదుగురు ఆటగాళ్లు తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్ల్లో అరంగేట్రం చేయబోతున్నారు. వీరిలో యుజ్వేంద్వ చాహల్, ఫయాజ్ ఫజల్, మన్ దీప్ సింగ్, కరుణ్ నాయర్, జయంత్ యాదవ్లు భారత జెర్సీని మొదటిసారి ధరించనున్నారు. అయితే మరో యువ క్రికెటర్ లోకేష్ రాహుల్లు కూడా అంతర్జాతీయ అనుభవం తక్కువగానే చెప్పాలి. కేవలం టెస్టు మ్యాచ్లు మాత్రమే ఆడిన రాహుల్.. జింబాబ్వే పర్యటన ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేయబోతున్నాడు. ఇదిలా ఉండగా జింబాబ్వే పర్యటనకు వెళ్లిన భారత జట్టులో ధోని తో పాటు, అంబటి రాయుడు, అక్షర్ పటేల్ కు మాత్రమే అంతర్జాతీయంగా ఆడిన అనుభవం ఉంది.
మరోవైపు ధోని కూడా జింబాబ్వే పర్యటనకు వెళ్లి దాదాపు 11 ఏళ్లు కావడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో జింబాబ్వే పర్యటనకు వెళ్లిన ధోని ఆ తరువాత అక్కడకు వెళ్లలేదు. 2005లో సౌరవ్ గంగూలీ సారథ్యంలో పర్యటించిన భారత జట్టుతో పాటు చివరిసారి ధోని అక్కడకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో ధోని కూడా జింబాబ్వే పర్యటన కొత్తదనే చెప్పాలి. దీంతో సరికొత్త జట్టుకు ధోని ఏ వ్యూహ రచనతో సిద్ధం చేస్తాడో వేచి చూడాల్సిందే.