కూతుర్ని తనివితీరా చూడకుండానే...
విశాఖపట్నం: తన రెండో కుమార్తెతో అదృష్టం కలిసొచ్చిందని ఇంగ్లండ్ క్రికెట్ టెస్టు కెప్టెన్ అలిస్టర్ కుక్ భావిస్తున్నాడు. ఇటీవల జన్మించిన తన కుమార్తెను చూసి మురిసిపోయేందుకు సమయం చిక్కడం లేదని వాపోయాడు. తన కూతుర్ని చూసేందుకు అక్టోబర్ లో బంగ్లాదేశ్ టూర్ నుంచి కుక్ స్వదేశం చేరుకున్నాడు. అయితే 18 గంటలు మాత్రమే అతడు కుటుంబంతో గడిపాడు. తన ముద్దుల కూతుర్ని తనివితీరా చూడకముందే భారత్ కు పయనమయ్యాడు.
టీమిండియాతో రాజ్ కోట్ లో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించాడు. దీంతో భారత్ లో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన విదేశీ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. టెస్టుల్లో 30 సెంచరీలు చేసి తన రికార్డు మెరుగుపరుచుకున్నాడు. ‘కేవలం 18 గంటల పాటు నా కుమార్తెను చూడడానికి సమయం చిక్కింది. ముద్దులొలికే పాపాయిని వదిలిరావడానికి చాలా కష్టపడ్డా. ఆమె పుట్టగానే అదృష్టం కలిసివచ్చి మరిన్ని పరుగులు సాధించాన’ని కుక్ చెప్పాడు.
అయితే తనను బ్రాడ్‌మన్ తో పోల్చవద్దని కోరాడు. విశాఖపట్నంలో గురువారం నుంచి టీమిండియాతో జరగనున్న రెండో టెస్టులోనూ రాణించేందుకు కుక్ సన్నద్దమవుతున్నాడు.