డేర్ డెవిల్స్ తలరాత మారేనా?
చెన్నై: ఐపీఎల్-8లో భాగంగా గురువారం జరగనున్న రెండో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, డేర్ డెవిల్స్ తలపడనున్నాయి. గత సీజన్ లో చివరిస్థానంలో నిలిచిన ఢిల్లీ టీమ్ ఈసారి తమ తలరాత మార్చుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం రూ.16 కోట్ల భారీ మొత్తం వెచ్చించి యువరాజ్ సింగ్ ను దక్కించుకుంది. యువీపై భారీగా ఆశలు పెట్టుకుంది. మురళీ విజయ్ కూడా కొనుక్కుని కొత్త ఉత్సాహంతో ఉంది. అయితే ఆల్ రౌండర్ మాథ్యూస్ అందుబాటులో లేకపోవడం ఢిల్లీకి కాస్త ఇబ్బందే.
ధోని సేనను సొంత మైదానంలో ఓడించడం అంత తేలిక కాదు. చెన్నైలో సూపర్ కింగ్స్ తో ఆడిన గత మూడు మ్యాచ్ ల్లో ఢిల్లీ ఓటమి చవిచూసింది. ఇక చైన్నై జట్టు అన్ని విభాగాల్లో సమతూకంతో ఉంది. బ్రెండన్ మెక్ కల్లమ్ సూపర్ ఫామ్ లో ఉండడం మరింత కలిసొచ్చే అంశం. బరోడా ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ గాయపడడంతో అతడు ఈ మ్యాచ్ లో ఆడడం అనుమానమే. చేయి తిరిగిన అశ్విన్ ఉండనే ఉన్నాడు. ఇక ఢిల్లీ టీమ్ లో ఇమ్రాన్ తాహిర్ స్పిన్ భారం మోయనున్నాడు.