కొత్త జట్లు.. కొత్త వేలం!
న్యూఢిల్లీ: ఐపీఎల్ నుంచి రెండేళ్ల పాటు చెన్నై సూపర్‌కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు దూరమవడంతో బీసీసీఐలో టెన్షన్ మొదలైంది. బోర్డుకు కాసుల పంట పండిస్తున్న ఈ లీగ్‌లో ఆ రెండు జట్లు ప్రధానమైనవి. దాంతో తాజా పరిణామాలపై చర్చించేందుకు ఐపీఎల్ గవర్నింగ్ కమిటీ ఈనెల 19న సమావేశం కాబోతోంది. ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్, మాజీ ఆటగాళ్లు సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే సహా మొత్తం 11 మంది పాల్గొంటారు. అయితే తీర్పుకు సంబంధించిన పూర్తి పత్రాలు బీసీసీఐ న్యాయ సంఘానికి అందిన తర్వాతే సమావేశం ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా 3 అంశాలపై ఎక్కువగా చర్చించే అవకాశం ఉంది.
అవి
ఆ రెండు జట్ల స్థానాల్లో కొత్త వాటి కోసం బిడ్డింగ్‌ను ఏర్పాటు చేయడం.
చెన్నై, రాజస్థాన్ ఆటగాళ్లను మాత్రమే వేలంలో ఉంచడం, లేదా అందరు ప్లేయర్లను వేలంలోకి తీసుకురావడం.
చెన్నై మాతృసంస్థ అయిన ఇండియన్ సిమెంట్స్ నుంచి దాన్ని విడిగా ఏర్పాటు చేయడం.
న్యాయపరమైన ఇబ్బందులు..
చెన్నైని దాని మాతృ సంస్థ నుంచి వేరు చేయడంపై గత సమావేశంలోనే చర్చించినట్లు, అయితే న్యాయ పరమైన సలహాల కోసం వేచి ఉన్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఆ రెండు జట్ల యజమాన్యాలు అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నా కొన్ని ఇబ్బందులు ఉన్నట్లు చెప్పా రు. తర్వాతి సమావేశంలో దానిపై చర్చిస్తామని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆ జట్లపై మంచి అభిప్రాయం పోయిన నేపథ్యంలో ఎవరైనా కొంటారా? ఒకవేళ కొన్నా ఈ తీర్పు దృష్ట్యా వారిపై ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
కొత్త జట్లు..
ఆ రెండు జట్లను వదిలేసి కొత్త జట్లను తేవడమే బీసీసీఐ చివరి ఆప్షన్‌లా కనిపిస్తోంది. కొత్త జట్లు వస్తే వారికి ఎక్కువ ఆటగాళ్లు అందుబాటులో ఉండరు. సస్పెండ్ అయిన రెండు జట్లలోని 45 మంది ఆటగాళ్లతో ఒక చిన్న వేలం నిర్వహించాలని బోర్డు భావిస్తోంది. అయితే తక్కువ మంది ప్లేయర్లు ఉంటారంటే కొత్త యజమానులు జట్లను కొంటారా అనేదే ప్రశ్న? అందరు ఆటగాళ్లను మరోసారి వేలంలోని తీసుకొచ్చి మళ్లీ మొదట్నుంచి మొదలుపెట్టే అవకాశం కూడా లేకపోలేదు.