
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ రన్నరప్ పీవీ సింధు అగ్రస్థానంపై కన్నేసింది. వచ్చే సీజన్‌లో బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్‌ర్యాంకులో నిలవాలనుకుంటున్నట్లు తెలిపింది. ‘నేనిప్పుడు మూడో ర్యాంకులో ఉన్నా. కొత్త సీజన్‌లో తొలి ర్యాంకుకు చేరాలనుకుంటున్నా. బాగా ఆడితే ఆటోమెటిక్‌గా ర్యాంకూ మెరుగవుతుంది. కాబట్టి దీనిపై మరీ ఎక్కువగా ఆలోచించడం లేదు. కోర్టులో మెరుగైన ప్రదర్శనపైనే దృష్టిసారించా. తద్వారా ర్యాంకు మారుతుందని తెలుసు’ అని సింధు తెలిపింది. ప్రస్తుతం ఆమె ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో చెన్నై స్మాషర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తోంది. 22 ఏళ్ల హైదరాబాదీ స్టార్ షట్లర్ ఈ ఏడాది సయ్యద్ మోడి గ్రాండ్ ప్రి, కొరియా ఓపెన్ టైటిల్స్‌ను గెలవడంతో పాటు ప్రపంచ చాంపియన్‌షిప్, హాంకాంగ్ ఓపెన్, దుబాయ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచింది.
ఒక దశలో స్థిరమైన విజయాలతో ఆమె రెండో ర్యాంకుకు ఎగబాకి... రెండు నెలలపాటు టాప్–2లో నిలిచింది. ‘ప్రస్తుతం మహిళల సింగిల్స్‌లో పోటీ పెరిగి సుదీర్ఘ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. గతంతో పోల్చుకుంటే గంటన్నర పాటు కోర్టుల్లో చెమటోడ్చాల్సి వస్తోంది’ అని పేర్కొంది. మొత్తంమీద 40 నిమిషాల ఆట పెరిగిందని సింధు చెప్పింది. స్వదేశంలోని ప్రేక్షకుల మధ్య ఆడటాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తూనే ఉంటానని, దీన్ని ఒత్తిడిగా భావించనని పేర్కొంది.