దుబాయ్: ‘ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడచూడ రుచుల జాడ వేరు’ ప్రస్తుతం ఈ పద్యం దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం అధికారులు చదువుకుంటున్నారు. ఎందుకంటే ఆస్ట్రేలియా పాకిస్తాన్‌ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో తప్పిదం చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో రెండు దేశాలు జెండాలు ఎగరేయడం ఆనవాయితీ. కానీ ఆదివారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జెండా బదులు న్యూజిలాండ్ జెండా ఎగరేశారు. దీనిని ఎవ్వరూ గమనించకపోవడం విడ్డూరం. అయితే ఆసీస్ జర్నలిస్టు ఈ విషయాన్ని పసిగట్టి ట్వీటర్‌లో పోస్ట్ చేశాడు. ఇది కాస్త వైరల్ అయి దుబాయ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడ పట్ల ఆసీస్ అభిమానులు విమర్శించారు. దీంతో తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసిన స్టేడియం నిర్వాహకులు.. రెండు దేశాల జెండాలు ఒకే రీతిలో ఉండటంతో ఈ తప్పిదం చోటు చేసుకుందని కప్పిపుచ్చుకునే యత్నం చేశారు. క్రికెట్‌లో ఇలాంటి సంఘటనలు జరగటం కొత్తేం కాదు. గతంలో కూడా ఓ మ్యాచ్‌లో భారత జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేశారు. మ్యాచ్ మధ్యలో ఆ విషయాన్ని గుర్తించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంపైర్లకు చెప్పి సరిచేపించాడు.
ఇక ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. పాక్ సిరీస్‌లో రాణించి పునర్వైభవం సాధించాలనుకున్న ఆసీస్‌కు శుభారంభం లభించలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ 482 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పసతగ్గిన ఆసీస్ బౌలింగ్‌పై పాక్ బ్యాట్స్‌మెన్ పైచేయి సాధించారు. ఓపెనర్ మహ్మద్ హఫీజ్ (126), హారీస్ సోహైల్ (110) శతకాలతో రెచ్చిపోయారు. వీరికి తోడుగా ఇమాముల్ హక్(76), ఆసద్ షఫీఖ్(80) అర్థసెంచరీలతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో సిడిల్ మూడు వికెట్లు పడగొట్టగా, లియాన్ రెండు వికెట్లు, హోలండ్, స్టార్క్, ల్యాబస్‌చేంజ్ తలో వికెట్ సాధించారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. క్రీజులో ఆసీస్ ఓపెనర్లు ఖవాజా (17), ఫించ్(13)లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment