ఆక్లాండ్ : టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్లలో ఒకడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 26 ఏళ్ల బుమ్రా తన వైవిధ్యమైన బౌలింగ్ యాక్షన్‌తో అన్ని ఫార్మాట్‌లలో రాణిస్తూ ఇండియాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో కివీస్‌కు చెందిన ఒక కుర్రాడు అచ్చం బుమ్రా బౌలింగ్ యాక్షన్‌ను దించేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కాగా వీడియోలో ఆ కుర్రాడు అచ్చం బుమ్రా తరహాలోనే బంతిని పట్టుకొని స్లోరన్‌అప్‌తో బౌలింగ్ వేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న కివీస్ మాజీ ఆల్‌రౌండర్ స్కాట్ స్టైరిస్ కుర్రాడి బౌలింగ్‌ను వీడియో తీసి ట్విటర్‌లో షేర్ చేశాడు. తర్వాత ఆ కుర్రాడిని దగ్గరకు పిలిచి అచ్చం బుమ్రాలాగే బౌలింగ్ వేశావంటూ అభినందించాడు.
కాగా టీమిండియా ప్రసుత్తం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. శనివారం రెండో వన్డే ప్రారంభానికి ముందు నెట్స్‌లో బౌలింగ్ సాధన చేస్తున్న బుమ్రా, యుజువేంద్ర చాహల్ వద్దకు కివీస్ మాజీ ఆటగాడు సైమన్ డౌల్ వచ్చి కుర్రాడి బౌలింగ్ వీడియో క్లిప్పింగ్‌ను చూపించాడు.ఆ వీడియో చూసి బుమ్రా నవ్వుకోగా, చాహల్ మాత్రం ' అరె!అచ్చం బుమ్రా బౌలింగ్‌ను దించేశాడు. బుమ్రా కంటే ఈ కుర్రాడి బౌలింగే బాగుంది' అంటూ ఫన్నీగా పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment