‘గోల’ను మిస్సవుతున్నాం
ఐపీఎల్ సందడిపై ఆటగాళ్ల పెదవి విరుపు
అబుదాబి: చీర్ లీడర్స్ వయ్యారాలు వలకబోస్తున్నా... అభిమానుల్లో ఊపు లేదు. స్టేడియాలు నిండుతున్నా... హోరెత్తించే అరుపులు, కేరింతలు లేవు. అభిమానుల సందడి కనబడుతున్నా... ఆకట్టుకునే వేషాలుగానీ, హుషారెత్తించే అభినయాలుగానీ కనడబడటం లేదు. మ్యాచ్ మధ్యలో చెవులు దద్దరిల్లే మ్యూజిక్ సౌండ్స్, సూపర్‌హిట్ పాటల హోరు అసలే లేదు. ఓవరాల్‌గా యూఏఈలో ఐపీఎల్ మ్యాచ్‌లు చప్పగా సాగిపోతుండటంపై కొంత మంది ఆటగాళ్లు పెదవి విరుస్తున్నారు.
భారత్‌తో పోలిస్తే ఇక్కడ వాతావరణ చాలా భిన్నంగా ఉందని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ అన్నాడు. ప్రేక్షకుల ఉత్సాహం, ఆ సందడి, ఊపు ఇక్కడ మచ్చుకైన కనబడటం లేదని వాపోతున్నాడు. అయితే టోర్నీ ముందుకు సాగేకొద్దీ కొద్దిగానైనా మార్పు వస్తుందని ఆశిస్తున్నాడు. షాన్ మార్ష్ కూడా మిల్లర్ వ్యాఖ్యలతో ఏకీభవించినా... దుబాయ్‌లోని దగ్గరి ప్రాంతాల్లో తిరగడం కొత్త అనుభూతినిస్తోందన్నాడు. యూఏఈలో వేడి అధికంగా ఉన్నా... ప్రస్తుతం బాగానే ఉందన్నాడు. ఇది ఇలాగే కొనసాగితే బాగుంటుందని కోరుకుంటున్నాడు. మళ్లీ భారత్‌లో మ్యాచ్‌లు మొదలైతే సందడి ఉంటుందని ఆటగాళ్లు ఆశిస్తున్నారు.