గంగూలీని పక్కన పెట్టేశాడు!
న్యూఢిల్లీ: గతేడాది టీమిండియా క్రికెట్ జట్టు మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి, మాజీ దిగ్గజ కెప్టెన్ సౌరవ్ గంగూలీల మధ్య విభేదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. భారత జట్టు ప్రధాన కోచ్ ఎంపికలో వీరిద్దర మధ్య మాటల యుద్దం జరిగింది. భారత ప్రధాన కోచ్గా అనిల్ కుంబ్లేను ఎంపిక చేసిన విషయంలో రవిశాస్త్రి తనదైన శైలిలో విమర్శలు గుప్పించాడు. ప్రధానంగా గంగూలీనే టార్గెట్ చేస్తూ మాటల యుద్ధానికి దిగాడు. దానికి గంగూలీ కూడా దీటుగా బదులివ్వడంతో అప్పట్లో రవిశాస్త్రి వెనక్కి తగ్గక తప్పలేదు. అయితే వీరి మధ్య చోటు చేసుకున్న ఆనాటి వాగ్వాదం ఇంకా చల్లారినట్లు కనబడుట లేదు. సందర్భం వచ్చినప్పుడల్లా గంగూలీపై పైచేయి సాధించాలని రవిశాస్తి యత్నిస్తూనే ఉన్నాడు. కొన్ని రోజుల క్రితం బెంగాల్ బౌలర్ మొహ్మద్ షమీని బెంగాల్ టైగర్ అంటూ వ్యాఖ్యానిస్తూ గంగూలీని వెనక్కి నెట్టే యత్నం కూడా చేశాడు.
కాగా, మరోసారి రవిశాస్త్రి తన అక్కసును వెళ్లగక్కాడు. రవిశాస్త్రి పేర్కొన్న టీమిండియా గ్రేట్ కెప్టెన్ల జాబితాలో గంగూలీకి స్థానం ఇవ్వలేదు. దాంతో పాటు గంగూలీ పేరుతో పాటు నడిచే దాదా హోదాను మరో భారత కెప్టెన్ కు కట్టబెట్టేశాడు రవిశాస్త్రి . గత కొన్ని రోజుల క్రిత టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న మహేంద్ర సింగ్ ధోనికి దాదా అనే పదాన్ని తగిలించాడు. 'దాదా కెప్టెన్' ధోని అంటూ కితాబిచ్చాడు. 'ఎంఎస్ ధోని సాధించలేనిది ఏదీ లేదు. దాంతో పాటు అతను నిరూపించుకోవాల్సి కూడా ఏమీ లేదు. కోహ్లికి పగ్గాలు అప్పజెప్పడానికి ధోని చేసిన త్యాగం చేశాడు.దాదా కెప్టెన్ కు సలామ్'అంటూ రవిశాస్త్రి పేర్కొన్నాడు.
కపిల్దేవ్, అజిత్ వాడేకర్, టైగర్ పటౌడీ, మహేంద్ర సింగ్ ధోనిలే భారత గ్రేట్ కెప్టెన్ల అంటూ రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఇక్కడ భారత్ క్రికెట్ జట్టుకు దూకుడు నేర్పిన గంగూలీని శాస్త్రి అస్సలు పట్టించుకోలేదు. గంగూలీ తన కెరీర్లో 49 టెస్టులకు సారథ్య వహించగా 42.6 విజయశాతాన్ని నమోదు చేశాడు.దాంతో పాటు 147 వన్డే కెప్టెన్సీలో 76 విజయాలను గంగూలీ సాధించాడు. తన గ్రేట్ జాబితాపై మాట్లాడిన రవిశాస్త్రి.. ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ గణాంకాలను నమోదు చేసిన భారత కెప్టెన్లకే తన జాబితాలో స్థానం కేటాయించినట్లు పేర్కొన్నాడు. అయితే రవిశాస్త్రి పేర్కొన్న ముగ్గురు కెప్టెన్ల కంటే గంగూలీ రికార్డే ఇక్కడ మెరుగ్గా ఉండటం గమనార్హం. అంటే గంగూలీతో రవిశాస్త్రికి ఉన్న వైరమే కారణంగా కనబడుతోంది. మరి గంగూలీ అభిమానులు ఏమంటారో చూడాలి.