నాతో గంగూలీకి సమస్య ఏమిటో?:రవిశాస్త్రి
న్యూఢిల్లీ: తాను టీమిండియా ప్రధాన కోచ్ పదవికి ఇంటర్య్యూ ఇచ్చినప్పుడు బీసీసీఐ అడ్వైజరీ కమిటీ సభ్యుల్లో ఒకరైన సౌరవ్ గంగూలీ అక్కడ లేకపోవడంపై మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి అసంతృప్తి వ్యక్తం చేశాడు. అసలు తనతో గంగూలీకి సమస్య ఏమిటో అర్ధం కావడం లేదన్నాడు. తాజాగా జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో గంగూలీతో ఏమైనా సమస్య ఉందా?అన్న ప్రశ్నకు రవిశాస్త్రి స్పందించాడు.
తాను కేవలం గంగూలీ అక్కడ లేని విషయాన్ని మాత్రమే చెప్పగలనని, అలా ఎందుకు జరిగిందో తనకు తెలియదన్నాడు. అసలు తనను గంగూలీ ఇంటర్య్వూ చేయకపోవడానికి అతనికి వచ్చిన సమస్య ఏమిటో మీరే అడగాలంటూ రవిశాస్త్రి కాస్త అసహనం వ్యక్తం చేశాడు. తాను ఆ ఇంటర్య్వూకు హాజరైంది సీఈవో జాబ్ కోసం కాదంటూ రవిశాస్త్రి తనలోని అసంతృప్తిని వెళ్లగక్కాడు. తాను ఇంటర్య్వూ ఇచ్చిన క్రమంలో వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్, సంజయ్ జగ్దాలేలతో మంచి వాతావారణంతో కూడిన చర్చే సాగిందని రవిశాస్త్రి ఈ సందర్భంగా తెలిపాడు.
తాను టీమిండియా డైరెక్టర్ గా ఉన్న కాలంలో జట్టు సాధించిన ఘనతను అడ్వైజరీ కమిటీ సభ్యులకు వివరించినట్లు తెలిపాడు. ప్రత్యేకంగా విదేశాల్లో సాధించిన ఘనతలను ఇంటర్య్వూ సందర్భంగా ప్రస్తావించినట్లు రవిశాస్త్రి తెలిపాడు. ఇంటర్య్వూ ఇవ్వడం మాత్రమే తన కర్తవ్యం అని, అంతర్గతంగా ఏమి జరిగిందో చూడటం తన పని కాదన్నాడు. కుంబ్లే కోచింగ్లో భారత జట్టు మరిన్ని విజయాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రత్యేకంగా భారత బౌలింగ్ విభాగం బాగా మెరుగుపడే అవకాశం ఉందన్నాడు.