రవిశాస్త్రికే అందలం..
న్యూఢిల్లీ: భారత క్రికెట్ కోచ్ ఎంపిక డ్రామాకు మంగళవారం తెరపడింది. కోచ్ ఎంపికలో అనూహ్యం ఏమీ జరగలేదు. భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి అందరూ ఊహించినట్లుగానే రవిశాస్త్రినే వరించింది. అయితే, మీడియాలో ముందుగా రవిశాస్త్రి పేరు బయటకు వచ్చినా.. అదేం లేదు ఇంకా సమయం ఉందంటూ బీసీసీఐ ఊదరగొట్టింది. గత కొన్నిరోజుల నుంచి కొనసాగుతున్న సందిగ్థతకు ముగింపు పలుకుతూ మాజీ డైరెక్టర్ రవిశాస్త్రినే కోచ్ గా నియమించింది. రవిశాస్త్రి కోచ్ పదవి రేసులోకి వచ్చిన మరుక్షణమే విరాట్ కోహ్లి కొత్త గురువు అనే దానికి దాదాపు సమాధానం దొరికినప్పటికీ, తాజాగా దానికి ఫుల్ స్టాప్ పడింది.
దరఖాస్తులు, ఇంటర్వ్యూలు అంటూ బీసీసీఐ హడావిడి చేసినా... రవిశాస్త్రి అడుగు పెట్టడంతోనే ఈ ప్రక్రియ లాంఛనమేనని అర్థమైంది. ఇప్పుడు దానికి అధికారిక ముద్ర పడింది. ఈ మేరకు సచిన్ టెండూల్కర్ , సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణలతో కూడిన బీసీసీఐ అడ్వైజరీ(సీఏసీ) రవిశాస్త్రి పేరును సూచించగా, అందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో 55 ఏళ్ల రవిశాస్త్రి చీఫ్ కోచ్ గా ఎంపికయ్యారు. మొత్తంగా ఆరుగురు అభ్యర్ధులు ఇంటర్య్వూలు చేయగా రవిశాస్త్రి వైపు సీఏసీ మొగ్గు చూపింది. అడ్వైజరీ కమిటీ ముందు రవిశాస్త్రి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. గతంలో టీమిండియా డైరెక్టర్ గా పనిచేయడమే రవిశాస్త్రికి బాగా కలిసొచ్చిన అంశం. శ్రీలంక పర్యటనతో రవిశాస్త్రి తన బాధ్యతల్నిచేపట్టే అవకాశం ఉంది.
టీమిండియా డైరెక్టర్‌గా రవిశాస్త్రి పని చేసిన సమయంలో భారత్.. ఆస్ట్రేలియాలో తొలిసారి పరిమిత ఓవర్ల సిరీస్ ను ఖాతాలో వేసుకుంది. టీ 20 సిరీస్ ను 3-0 తో గెలిచింది. దాంతో పాటు టెస్టుల్లో నంబర్ వన్ ర్యాంకును సైతం సొంతం చేసుకుంది భారత జట్టు. మరొకవైపు 2015 వన్డే వరల్డ్ కప్, 2016 టీ 20 వరల్డ్ కప్ల్లో సైతం సెమీస్ కు చేరుకుంది. సుమారు రెండేళ్ల తన పదవీ కాలంలో డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని పంచుకున్న రవికి జట్టు ఆటగాళ్లపై మంచి అవగాహన ఉంది. మరొకవైపు వ్యాఖ్యాతగా వివిద జట్లను దగ్గర్నుంచి పరిక్షీంచిన అనుభవం కూడా శాస్త్రిది.
టీమిండియా బౌలింగ్ కోచ్‌గా జహీర్‌ఖాన్, బ్యాటింగ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ను నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రస్తుత అధ్యక్షుడు సీకే ఖన్నా ప్రకటించారు. ఈ ముగ్గురు 2019 వరల్డ్ కప్ పూర్తయ్యే వరకూ ఆయా పదవుల్లో కొనసాగనున్నారు.
సచినే కారణం..!
అనిల్ కుంబ్లే ఆకస్మింగా కోచ్ పదవి నుంచి వైదొలిగిన తరువాత ఒక్కసారిగా రవిశాస్త్రి వెలుగులోకి వచ్చాడు. కోచ్ పదవి కోసం బీసీసీఐ మొదటిసారి దరఖాస్తులు కోరగా అందుకు రవిశాస్త్రి దూరంగా ఉండిపోయాడు. గతేడాది కోచ్ ఎంపికకు సంబంధించి సీఏసీలో సభ్యుడైన సౌరవ్ గంగూలీతో నెలకొన్న విభేదాల నేపథ్యంలో రవిశాస్త్రి ఆ పదవి కోసం పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే రవిశాస్త్రి కోచ్ గా వస్తే బాగుంటుందని విరాట్ కోహ్లి కూడా సూచయగా చెప్పడంతో అతని పేరు తెరపైకి వచ్చింది.
దానిలో భాగంగానే బీసీసీఐ రెండోసారి దరఖాస్తుల్ని ఆహ్వానించిందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈసారి తాను మళ్లీ క్యూలో నిలబడి దరఖా స్తు ఇవ్వబోనన్న రవిశాస్ర్తి మనసు మార్చుకోవడం వెనుక దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఉన్నాడట. కోచ్ గా పనిచేసిన కుంబ్లే నిష్క్రమణ తరువాత బీసీసీఐపై తీవ్ర విమర్శల నేపథ్యంలో సచిన్ ముందడుగు వేశాడట. కోహ్లి కూడా రవిశాస్త్రిని కోరుకోవడంతో అతన్ని ఒప్పించేందుకు సచిన్ రంగంలోకి దిగి ఆ మేరకు సక్సెస్ అయ్యాడనేది సమాచారం.