కోచ్ ఎవరు? కోహ్లితో మాట్లాడిన తర్వాతే..: గంగూలీ
ముంబై: టీమిండియా తదుపరి కోచ్ ఎవరన్న దానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి సోమవారం ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో క్రికెట్ అడ్వయిజరీ కమిటీ (సీఏసీ) ఇంటర్వ్యూలు నిర్వహించింది. మొత్తం ఆరుగురు సీనియర్ క్రికెటర్లను సీఈసీ ఇంటర్వ్యూ చేసినట్టు సమాచారం. టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రినే కోచ్‌గా నియమించనున్నట్టు ఊహాగానాలు వచ్చినప్పటికీ సచిన్ టెండూల్కర్ , సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణలతో కూడిన సీఏసీ ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
కోచ్ ఎంపిక కోసం మరికొంత సమయం తీసుకుంటామని గంగూలీ సోమవారం విలేకరులకు తెలిపారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితోపాటు మరికొంత మందితో మాట్లాడాల్సి ఉందని, వారందరితో సంప్రదింపులు జరిపిన తర్వాత కొత్త కోచ్ ఎవరు అనేది ప్రకటిస్తామని గంగూలీ స్పష్టం చేశారు. కోచ్ రేసులో ముందున్నట్టు భావిస్తున్న రవిశాస్త్రకి కెప్టెన్ కోహ్లి మద్దతు పుష్కలంగా ఉందని, ఆయననే కోచ్‌గా నియమించాలంటూ కోహ్లి కోరుతున్నట్టు కథనాలు రాగా గంగూలీ వీటిని తోసిపుచ్చారు. కోచ్ ఎంపికకు కోహ్లి పూర్తిగా దూరంగా ఉన్నారని, ఈ విషయంలో ఎలాంటి సూచనలు, సలహాలు ఇవ్వలేదని గంగూలీ తెలిపారు.