
న్యూఢిల్లీ: శ్రీలంకలో జరిగిన నిదహస్ ట్రోఫీ ముక్కోణపు టి20 టోర్నీ ఫైనల్ మ్యాచ్‌తో ‘హీరో’ అయ్యే అవకాశాన్ని చేజార్చుకున్నానని ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ అన్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తుదిపోరులో కీలకమైన సమయంలో వరుసగా డాట్ బాల్స్ ఆడటంతో భారత్ కప్ కోల్పోయే పరిస్థితి వచ్చింది. దినేశ్ కార్తీక్ వీరోచిత మెరుపులతో చేజారిందనుకున్న కప్ చేతికందిన సంగతి తెలిసిందే. ‘ఆ రోజు నాకు దుర్దినం. దీన్ని మర్చిపోవడం కూడా కష్టంగానే ఉంది. మళ్లీ అలాంటి ఫైనల్లో నేను రాణిస్తే తప్ప ఆ చేదు జ్ఞాపకాన్ని మర్చిపోలేనేమో’ అని శంకర్ అన్నాడు. సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు అతనిపై లెక్కకు మిక్కిలి విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. దీనిపై అతను స్పందిస్తూ ‘టీమిండియాకు ఆడుతున్న నేను అవన్నీ స్వీకరించాల్సిందే.
నా క్రికెట్ కెరీర్ ఎదుగుదలకు అవి కూడా దోహదం చేస్తాయి. నిజానికి నేను డకౌటైనా బాగుండేది. ఎవరూ పెద్దగా స్పందించేవారు కాదు. కానీ క్లిష్టమైన సమయంలో అత్యంత పేలవంగా ఆడటం విమర్శలకు తావిచ్చింది. ఆటైన, కెరీరైనా ఎప్పుడు సాఫీగా సాగదు. సవాళ్లనేవి ఎదురవుతూనే ఉంటాయి. తప్పదు... వాటిని ఎదుర్కోవాలి’ అని చెప్పుకొచ్చాడు. ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీల్లో ఎప్పుడు ఇలా డాట్ బాల్స్ ఆడలేదని స్ట్రయిక్‌ను పదేపదే రొటేట్ చేసేవాడినని తెలిపాడు. దినేశ్ కార్తీక్ మ్యాచ్ గెలిపించకపోయివుంటే తన పరిస్థితి మరింత దారుణంగా ఉండేదన్నాడు. వచ్చే నెల మొదలయ్యే ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున మెరుగైన ప్రదర్శన కనబరిచేందుకు కష్టపడతానని విజయ్ శంకర్ చెప్పాడు.