సౌతాంప్టన్: ఇప్పటికే బొటన వేలి గాయంతో ఓపెనర్ శిఖర్ ధావన్ పూర్తిగా దూరమై, ఫిట్‌నెస్ సమస్యలతో పేసర్ భువనేశ్వర్ ఇబ్బంది పడుతున్న వేళ... టీమిండియాను కొంత కలవరపరిచే సంఘటన చోటుచేసుకుంది. బుధవారం ప్రాక్టీస్ సందర్భంగా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా వేసిన యార్కర్‌ను ఎదుర్కొనే క్రమంలో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ ఎడమ కాలి పాదానికి బంతి బలంగా తగిలింది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడాడు. అనంతరం పరిస్థితిని పర్యవేక్షించిన జట్టు మేనేజ్‌మెంట్ సాయంత్రానికి శంకర్ కోలుకున్నాడని, ఆందోళన అవసరం లేదని ప్రకటించింది. మరోవైపు గురువారం ప్రాక్టీస్‌లో దినేశ్ కార్తీక్ చాలాసేపు బ్యాటింగ్ సాధన చేశాడు.
ఈ తీరు చూస్తుంటే శనివారం అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో అతడు తుది జట్టులో ఉండే అవకాశం కనిపిస్తోంది. శంకర్ మాత్రం బ్యాట్ పట్టలేదు. కాసేపు జాగింగ్ చేశాడు. ఇతర ఆటగాళ్ల ప్రాక్టీస్‌ను గమనిస్తూ ఉండిపోయాడు. గాయం ప్రభావం లేనట్లు సాధారణంగానే నడిచాడు. చివర్లో కొద్దిసేపు బౌలింగ్‌కు దిగినా షార్ట్ రనప్‌తో సరిపెట్టాడు. ప్రస్తుత సమీకరణాల్లో జట్టు కూర్పులో కీలకంగా మారిన శంకర్‌కు టోర్నీ ప్రారంభానికి ముందు సైతం నెట్స్‌లో బంతి మోచేతికి బలంగా తాకింది. దీంతో అతడిని న్యూజిలాండ్‌పై సన్నాహక మ్యాచ్ ఆడించలేదు. ధావన్ దూరమై, రాహుల్ ఓపెనింగ్‌కు వెళ్లిన నేపథ్యంలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో చోటుదక్కిన శంకర్ రెండు కీలక వికెట్లు తీశాడు. శుక్రవారం టీమిండియా ప్రాక్టీస్ నుంచి విరామం తీసుకోనుంది. శనివారం అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్ ఆడనుంది.
భువీ పరిస్థితేమిటో!
ప్రపంచకప్‌లో జట్టు రెండో ప్రధాన పేసర్‌గా నమ్మకం ఉంచిన భువనేశ్వర్ మరో 8 రోజుల తర్వాతే మైదానంలో దిగే పరిస్థితి కనిపిస్తోంది. తొడ కండరాలు పట్టేయడంతో పాక్‌తో మ్యాచ్ నుంచి మధ్యలో తప్పుకొన్న భువీ ఇంగ్లండ్‌తో మ్యాచ్ (జూన్ 30) సమయానికి కానీ కోలుకోడని తెలుస్తోంది. ఇప్పటికైతే అతడు ఫిట్‌నెస్ సాధిస్తాడనే బీసీసీఐ భావిస్తోంది. భువీ... బుధవారం జాగింగ్‌కే పరిమతమయ్యాడు. నెట్స్‌లో బౌలింగ్ చేయలేదు.
బ్యాట్స్‌మెన్‌ను గాయపర్చాలని బౌలర్లెవరూ కోరుకోరు. మా ప్రాక్టీస్ మేం చేసుకోవాలి కదా?. నావరకైతే బ్యాట్స్‌మెన్‌కు బంతులేయడమే మంచి సాధన. ఆ దిశగానే ప్రయత్నిస్తుంటా. కొన్నిసార్లు ఇలా జరుగుతుంటుంది. ఇదంతా ఆటలో ఒక భాగమే. నేనేం విజయ్‌ను లక్ష్యంగా చేసుకోలేదు (నవ్వుతూ). అతడు క్షేమంగానే ఉన్నాడు. ధావన్ జట్టుకు ముఖ్యమైన ఆటగాడు. తను దూరమవడం దురదృష్టకరం. దీనిని మర్చిపోయి ముందుకెళ్లాలి.
–జస్‌ప్రీత్ బుమ్రా, భారత పేసర్
Comments
Please login to add a commentAdd a comment