బుధవారం ప్రాక్టీస్ సెషన్‌లో రోహిత్, కెప్టెన్ కోహ్లి, చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, కోచ్ రవిశాస్త్రి
సౌతాంప్టన్: ఊహించినంతా అయింది. వరుస విజయాలతో ప్రపంచ కప్‌లో జోరు మీదున్న టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో బాధపడుతున్న ఓపెనర్ శిఖర్ ధావన్... టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. బుధవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆస్ట్రేలియాతో ఈ నెల 9న జరిగిన మ్యాచ్‌లో పేసర్ కమిన్స్ వేసిన బంతి బలంగా తాకడంతో ధావన్ ఎడమ బొటన వేలిలో చీలిక వచ్చింది. నొప్పితో బాధపడుతూనే ఆడిన అతడు మ్యాచ్‌లో సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
మున్ముందు జట్టు అవసరాలరీత్యా ధావన్ కోలుకునే వరకు చూడాలని మేనేజ్‌మెంట్ భావించింది. అందుకని ఓపెనర్ మూడు మ్యాచ్‌ల వరకు అందుబాటులో ఉండడని ప్రకటిం చింది. అయితే, తాజా పరిస్థితి ప్రకారం జూలై రెండో వారం వరకు కూడా ధావన్ పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. దీంతో అతడి స్థానాన్ని యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిష భ్ పంత్‌తో భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఇప్పటికే స్టాండ్‌బైగా ఎంపిక చేసిన పంత్... పాకిస్తాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌కు ముందే జట్టుతో చేరాడు.
రోహిత్, కోహ్లిపై భారం
ఫామ్‌లో ఉండీ ప్రతిష్టాత్మక టోర్నీకి అనూహ్యంగా దూరం కావడం వ్యక్తిగతంగా ధావన్‌ను తీవ్రంగా నిరాశకు గురిచేసే అంశమైతే, కీలకమైన అతడి సేవలు కోల్పోవడం కోహ్లి సేనను కలవరపాటుకు గురిచేసేదే. జట్టులో ఏకైక ఎడంచేతి వాటం బ్యాట్స్‌మన్ అయిన ధావన్‌కు ఐసీసీ టోర్నీల్లో అద్భుత రికార్డుంది. మొత్తం ఆరు సెంచరీలు (చాంపియన్స్ ట్రోఫీలో 3, ప్రపంచ కప్‌లలో 3) బాదాడు. అన్నింటికి మించి ధావన్–రోహిత్ శర్మ ప్రపంచ అత్యుత్తమ ఓపెనింగ్ జోడీ. వీరిద్దరు ఎన్నో చక్కటి ఆరంభాలు ఇచ్చారు. ఒకరు విఫలమైనా మరొకరు రాణిస్తూ... వన్‌డౌన్‌లో వచ్చే కెప్టెన్ కోహ్లికి అండగా నిలుస్తున్నారు. కొన్నేళ్లుగా భారత విజయ యాత్రలో ఈ త్రయానిదే ప్రధాన వాటా. ఇప్పుడు ధావన్ దూరమవడం కచ్చితంగా ప్రభావం చూపేదే. ఈ నేపథ్యంలో రోహిత్, కోహ్లిపై మరింత భారం పడుతుంది. రెండో ఓపెనర్‌గా రాహుల్ ముందు పెద్ద బాధ్యతే ఉంది.
జట్టు కూర్పుపై ప్రభావం
ధావన్ బదులుగా ఎంపిక చేసిన పంత్‌కు తుది జట్టులో చోటు మాత్రంఅనుమానమే. అతడిని తీసుకుంటే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలి. హార్డ్ హిట్టర్ అయిన పంత్... మిడిలార్డర్‌కు తగిన రీతిలో స్ట్రయిక్ రొటేట్ చేయలేడు. రాహుల్‌పై భరోసా లేకుంటే ఓపెనర్‌గా పంత్‌ను పరీక్షించవచ్చు. అలాగైతే అది పెద్ద ప్రయోగమే అవుతుంది. ఎలాగూ స్కోరు పెంచే ఉద్దేశంలో నంబర్–4గా పాండ్యాను పంపుతున్నందున పంత్ అవసరం ఎంత అనేది చూడాలి. మరోవైపు పేసర్ భువనేశ్వర్ కండరాల నొప్పితో బాధపడుతున్న వేళ, బౌలింగ్ ప్రత్యామ్నాయంగానూ పనికొచ్చే ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ వైపే జట్టు మొగ్గు చూపే వీలుంది. రాబోయే రెండు మ్యాచ్‌లు బలహీన అఫ్గానిస్తాన్, విండీస్‌పైనే కాబట్టి వాటిపై జట్టు కూర్పును పరీక్షించుకుంటే తర్వాత తప్పొప్పులను సరిచేసుకునే వీలుంటుంది.
2019 ప్రపంచ కప్‌లో ఇకపై భాగం కాలేకపోతున్నాననే ప్రకటన చేయడానికి భావోద్వేగానికి గురయ్యా. దురదృష్టవశాత్తు గాయం సమయానికి నయం కావడం లేదు. కానీ, మన జట్టు విజయ పరంపర ముందుకు సాగాలి. జట్టు సభ్యులు, క్రికెట్ ప్రేమికులు, భారత దేశం నుంచి దక్కిన ప్రేమ, మద్దతుకు నేను ధన్యుడిని. జై హింద్!
– ట్విట్టర్‌లో శిఖర్ ధావన్
పంత్‌కు జాక్‌పాట్!
సరిగ్గా రెండు నెలల క్రితం రిషభ్ పంత్‌ను ప్రపంచ కప్ జట్టుకు ఎంపిక చేయకపోవడాన్ని దిగ్గజాలు సహా అందరూ తప్పుబట్టారు. స్వయంగా పంత్ తీవ్ర నిరాశ చెందాడు. ఇప్పుడు మాత్రం అదృష్టం అతడిని మరో రూపంలో వరించింది. అన్నింట్లోనూ చోటు దక్కకున్నా పరిస్థితులు కలిసొస్తే కనీసం ఒకటి, రెండు మ్యాచ్‌ల్లోనైనా పంత్ తుది జట్టులో ఉండే వీలుంది. తద్వారా ప్రపంచ కప్ జట్టు సభ్యుడిగా చిరస్థాయిగా పేరు నిలిచే అవకాశం లభించింది.
Comments
Please login to add a commentAdd a comment