బర్మింగ్‌హామ్: ప్రస్తుత వన్డే వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌పై సాధించిన ఘన విజయంతో 1992 నాటి చరిత్ర పునరావృతం అవుతుందనే పాక్ అభిమానులు జోస్యం చెబుతున్నారు. పాకిస్తాన్ జట్టు తన మిగిలిన మ్యాచ్‌లన్నింటిలోనూ ఇదే తరహా స్ఫూర్తిదాయక విజయాలను నమోదు చేసి వరల్డ్‌కప్‌ను ఎగరేసుకుపోతుందని పాక్ అభిమానులతో పాటు ఆ దేశ మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 1992లో పడుతూ లేస్తూ సెమీస్‌కు చేరిన పాకిస్తాన్.. చివరికి ప్రపంచకప్‌ను గెలుచుకుందని, ఆ చరిత్ర మళ్లీ పునరావృతం అవుతోందని మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, వసీం అక్రమ్, షోయబ్ అఖ్తర్, జావెద్ మియాందాద్, రమీజ్ రజా తదితరులు వ్యాఖ్యానిస్తున్నారు.
కాగా, దీనిపై పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్ సర్పరాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. ‘1992 వరల్డ్‌కప్ గురించి ఆలోచించడం లేదు. అలా జరుగుతుందని అనుకోవడం లేదు. అలాగే జరగాలని ఏమీ లేదు. ప్రతీ మ్యాచ్ మాకు ముఖ్యమే. విజయాలు సాధిస్తూ ముందుకు సాగడమే మా లక్ష్యం. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో బాబర్ అజామ్, హరీస్ సొహైల్ బ్యాటింగ్ అద్భుతం. నేను చూసిన బాబర్ ఇన్నింగ్స్‌ల్లో ఇదొక అత్యుత్తమ ఇన్నింగ్స్. క్లిష్టమైన పిచ్‌పై బాబర్ సెంచరీ చేసి విజయంలో పాలు పంచుకోవడం ఆనందంగా ఉంది. యాభై ఓవర్ల పాటు క్రీజ్‌లో ఉండాలనే తలంపుతోనే బ్యాటింగ్‌కు దిగాం. ఈ క్రెడిట్ అంతా బాబర్, హరీస్‌లదే. ఒత్తిడిని అధిగమిస్తూ వారు అద్వితీయంగా రాణించారు. ఊహించిన పేస్‌ను, గింగిరాలు తిరిగే స్పిన్‌ను ఎదుర్కొంటూ వారు పోరాడిన తీరు అమోఘం’ అని సర్ఫరాజ్ కొనియాడాడు.
Comments
Please login to add a commentAdd a comment