ఎదురులేని జొకోవిచ్
లండన్: ఈ ఏడాది వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గి అరుదైన రికార్డు సాధించాలనే పట్టుదలతో ఉన్న ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఈ డిఫెండింగ్ చాంపియన్ మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. బుధవారం సెంటర్ కోర్టులో జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో జొకోవిచ్ (సెర్బియా) 6-4, 6-3, 7-6 (7/5)తో అడ్రియన్ మనారినో (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు. జొకోవిచ్‌కిది వరుసగా 30వ గ్రాండ్‌స్లామ్ మ్యాచ్ విజయం కావడం విశేషం. గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో వావ్రింకా చేతిలో ఓటమి తర్వాత జొకోవిచ్ వింబుల్డన్, యూఎస్ ఓపెన్‌లలో అజేయంగా నిలిచి టైటిల్స్ సాధించాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్‌లలో కూడా చాంపియన్‌గా నిలిచాడు. గత రెండేళ్లలో వింబుల్డన్‌లో విజేతగా నిలిచిన జొకోవిచ్ ఈసారీ నెగ్గితే ‘హ్యాట్రిక్’ సాధిస్తాడు. దాంతోపాటు 1938లో డాన్‌బడ్జ్ (అమెరికా) తర్వాత వరుసగా ఐదు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుడిగా గుర్తింపు పొందుతాడు. మూడో రౌండ్‌లో 28వ సీడ్ సామ్ క్వెరీ (అమెరికా) లేదా థామస్ బెలూచి (బ్రెజిల్)లతో జొకోవిచ్ తలపడతాడు. మనారినోతో జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్ ఆరు ఏస్‌లు సంధించి, ఎనిమిది డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. 15 సార్లు నెట్ వద్దకు వచ్చి 10 సార్లు పాయింట్లు సాధించాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయాడు.
మరోవైపు మూడో సీడ్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) కూడా మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్‌లో ఫెడరర్ 6-0, 6-3, 6-4తో క్వాలిఫయర్, ప్రపంచ 772వ ర్యాంకర్ మార్కస్ విలిస్ (బ్రిటన్)పై గెలిచాడు. పదో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్), 19వ సీడ్ బెర్నాడ్ టామిక్ (ఆస్ట్రేలియా) తమ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో గెలిచి ముందంజ వేశారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో మూడో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలాండ్) 6-2, 6-1తో కొజ్‌లోవా (ఉక్రెయిన్)ను ఓడించి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. వర్షం కారణంగా మూడో రోజూ వింబుల్డన్ మ్యాచ్‌లకు అంతరాయం ఏర్పడింది. సెంటర్ కోర్టులో మాత్రం పైకప్పును మూయించి మ్యాచ్‌లను నిర్వహించారు.