జొకోవిచ్ కొత్త చరిత్ర
► 28 మాస్టర్స్ టైటిల్స్‌తో రికార్డు ఆరోసారి మయామి ఓపెన్ సొంతం
► అత్యధిక ప్రైజ్‌మనీ సంపాదించిన ప్లేయర్‌గా గుర్తింపు
ఫ్లోరిడా: నిలకడైన ఆటతీరుకు మారుపేరైన సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ కొత్త చరిత్ర సృష్టించాడు. రికార్డుస్థాయిలో 28వ మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకొని ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మయామి ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 6-3, 6-4తో కీ నిషికోరి (జపాన్)పై గెలిచాడు. తద్వారా ఆరోసారి మయామి ఓపెన్ టైటిల్‌ను దక్కించుకొని అత్యధికసార్లు ఈ టైటిల్ నెగ్గిన ప్లేయర్‌గా ఆండ్రీ అగస్సీ (అమెరికా) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. 28 ఏళ్ల జొకోవిచ్ 2007, 2011, 2012, 2014, 2015లలో కూడా ఈ టైటిల్‌ను సాధించాడు. మయామి టైటిల్ సాధించినందుకు జొకోవిచ్‌కు 1000 ర్యాంకింగ్ పాయింట్లతోపాటు 10 లక్షల 28 వేల 300 డాలర్ల (రూ. 6 కోట్ల 79 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది.
తాజా విజయంతో రాఫెల్ నాదల్ (స్పెయిన్-27 టైటిల్స్)ను వెనక్కి నెట్టి అత్యధిక మాస్టర్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుడిగా జొకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా ఏటీపీ సర్క్యూట్‌లో అత్యధిక ప్రైజ్‌మనీ సంపాదించిన ప్లేయర్‌గా కూడా ఈ సెర్బియా స్టార్ నిలిచాడు. ఇప్పటివరకు కెరీర్‌లో 63 సింగిల్స్ టైటిల్స్‌ను సాధించిన జొకోవిచ్ 9 కోట్ల 81 లక్షల 99 వేల 548 డాలర్లు (రూ. 648 కోట్లు) సంపాదించాడు. ఈ టోర్నీకి ముందు 9 కోట్ల 78 లక్షల 55 వేల 881 డాలర్లతో (రూ. 646 కోట్లు) అగ్రస్థానంలో ఉన్న రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) రెండో స్థానానికి పడిపోయాడు. ఈ గెలుపుతో జొకోవిచ్ తన కెరీర్‌లో 714వ విజయంతో అత్యధిక విజయాలు సాధించిన క్రీడాకారుల జాబితాలో తనకోచ్, జర్మనీ దిగ్గజం బోరిస్ బెకర్‌ను దాటి 11వ స్థానానికి చేరుకున్నాడు.