పాఠశాల విద్యలో క్రీడల్ని భాగం చేయాలని, అప్పుడే విద్యార్థులకు ఓటమి విలువేంటో ఆటలు నేర్పిస్తాయని టెన్నిస్ దిగ్గజం ఆండ్రీ అగస్సీ(Andre Agassi) చెప్పాడు. టీఐఈ (ద ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్) గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు భారత్‌కు విచ్చేశాడు ఈ అమెరికన్ మాజీ నంబర్‌వన్ టెన్నిస్ స్టార్. ఈ క్రమంలో క్రీడలతో భవిష్యత్తు, పాఠశాల విద్యపై తన అభిప్రాయాలు వెలిబుచ్చాడు.
గెలుపోటములు మనకు పాఠాలు నేర్పుతాయి
‘ఒకవేళ వైఫల్యం ఎదురైనా... తట్టుకొని నిలబడేందుకు, మళ్లీ మరుసటి రోజు వెంటనే ఆడేందుకు స్థయిర్యాన్ని క్రీడలే ఇస్తాయి. అందుకే చెబుతున్నా... క్రీడల్లోని గెలుపోటములు మనకు పాఠాలు నేర్పుతాయి. ఓడిన ప్రతీసారి గెలవడంపై మరింత దృష్టి పెట్టేలా చేస్తాయి. అంటే మెరుగయ్యేందుకు, ప్రగతి సాధించేందుకు దోహదం చేస్తాయి’ అని అగస్సీ వివరించాడు.
కాగా అగస్సీ రెండు దశాబ్దాల క్రితమే బలహీనవర్గాల పిల్లలు చదువుకోవాలనే లక్ష్యంతో పాఠశాలలు నిర్మించాడు. 2001లో మొదలైన ఈ సంకల్పంతో అతను 130 పాఠశాలల్ని ఏర్పాటు చేసి 80 వేల మంది చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాడు. టెన్నిస్ క్రీడ వల్లే తాను ఇంతలా రాటుదేలానని చెప్పుకొచ్చాడు.
స్పోర్ట్స్ అంటేనే సవాళ్లు...
అంతేకాదు... ఆటలు ఆడటం వల్ల మానసిక, శారీరక స్థయిర్యం పెరిగి... జీవితానికి సరిపడా ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నానని అగస్సీ చెప్పాడు. ‘స్పోర్ట్స్ అంటేనే సవాళ్లు... వాటిని అధిగమించడం. అంటే సమస్యకు ఎదురీది పరిష్కరించుకోవడం. టెన్నిస్ నాకు అదే నేర్పించింది. సవాళ్లు ఎదురైన ప్రతీసారి నిలబడి ఎదుర్కోవాలన్న ధైర్యాన్ని అలవర్చింది.
ఓడితే గెలిచేందుకు మరింత శ్రద్ధపెట్టాలన్న కసిని నాలో పెంచింది. పోరాటానికి అవసరమైన సాధన, సంపత్తిని సమకూర్చింది’ అని అగస్సీ పేర్కొన్నాడు. ప్రస్తుత విద్యలో టెక్నాలజీది ప్రముఖ పాత్రని అన్నాడు. అవసరమైన ప్రతి విద్యార్థి వ్యక్తిగత అభ్యాసానికి ఆధునిక టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతోందని చెప్పాడు.
తన కెరీర్‌లో ఎనిమిది గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించిన 54 ఏళ్ల అగస్సీ 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో సింగిల్స్‌లో స్వర్ణ పతకం కూడా గెలిచాడు. 2001లో జర్మనీ దిగ్గజం స్టెఫీ గ్రాఫ్‌ను అగస్సీ పెళ్లి చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment