Andre Agassi
-
ఆ ముగ్గురిలాంటి ప్రతిభ ఉన్నా...
బెంగళూరు: ప్రస్తుతం ప్రపంచ టెన్నిస్‌లో ప్రతిభావంతుడైన యువ ఆటగాళ్లలో స్పెయిన్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్ ఒకడు. నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన అతను ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్నాడు. అయితే అల్కరాజ్ ఆట గురించి టెన్నిస్ దిగ్గజం ఆండ్రీ అగస్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వేర్వేరు అంశాలపరంగా ముగ్గురు స్టార్లు జొకోవిచ్, రాఫెల్ నాదల్, రోజర్ ఫెడరర్‌లాంటి ఆట అతనిలో కనిపిస్తున్నా... వారిలా గొప్ప ఘనతలు సాధించలేడని అగస్సీ అభిప్రాయపడ్డాడు. ఈ ముగ్గురు దిగ్గజాలు వరుసగా 23, 22, 20 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గారు. ‘జొకోవిచ్ తరహా డిఫెన్స్, నాదల్లాంటి పవర్ గేమ్, ఫెడరర్లా చూడచక్కని ఆటను అల్కరాజ్ కూడా ప్రదర్శించాడు. అయితే ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన వారిలా అతను పెద్ద విజయాలు సాధించడం కష్టం. నేను జ్యోతిష్యం చెప్పేవాడిని కాదు కానీ టెన్నిస్ అలాంటి ఘనతలు అందుకోవాలంటే ఎన్నో కలిసి రావాలి. వ్యూహాలు, గాయాలు లేకపోవడంతో పాటు అదృష్టం కూడా ఉండాలి’ అని అగస్సీ వ్యాఖ్యానించాడు. మరోవైపు కెరీర్ చరమాంకంలో ఉన్న 37 ఏళ్ల జొకోవిచ్ ఇకపై అదే దూకుడు కొనసాగించలేడని కూడా అతను అన్నాడు. తాను అత్యుత్తమ స్థాయికి చేరే క్రమంలో ఎదురైన ముగ్గురు అద్భుత ప్రత్యర్థులు తప్పుకున్న తర్వాత అలాంటి ఆట కనిపించదని అగస్సీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘జొకోవిచ్ ఇప్పటికే కెరీర్లో చాలా సాధించాడు. అతని శక్తియుక్తులన్నీ సహజంగానే బలహీనంగా మారిపోతాయి. నా అభిప్రాయం ప్రకారం ఎదురుగా ప్రత్యరి్థని చూస్తే చాలు ఇంకా సాధించాలనే ప్రేరణ లభిస్తే విజయాలు దక్కుతాయి. తాను చరిత్ర సృష్టంచడంలో భాగమైన ఆ ముగ్గురు ఇప్పటికే తప్పుకున్నారు. పీట్ సంప్రాస్ రిటైరయ్యాక నాకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. దీని నుంచి ముందుకు సాగాలంటే మానసికంగా చాలా దృఢంగా ఉండాలి. జొకోవిచ్‌లో అలాంటిది ఉందా అనేది ఆసక్తికరం’ అని అగస్సీ వివరించాడు. తనకు ప్రత్యర్థిగా ఆడిన ఆండీ ముర్రే ఇప్పుడు కోచ్‌గా మారడం జొకోవిచ్‌కు సానుకూలతే అయినా... ఫలితాలు పరస్పర నమ్మకంతోనే వస్తాయని, అది అంత సులువు కాదని ఎనిమిది గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన అగస్సీ విశ్లేíÙంచాడు. 1980ల్లో, 1990ల్లో ప్రపంచ టెన్నిస్‌కు అమెరికా ఆటగాళ్లు శాసించిన విషయాన్ని గుర్తు చేస్తూ అగస్సీ... భవిష్యత్తులో అలాంటి మంచి రోజులు అమెరికాకు మళ్లీ వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆ సమయంలో తనతో పాటు సంప్రాస్, జిమ్ కొరియర్, మైకేల్ చాంగ్ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగామని వెల్లడించాడు. -
‘అప్పుడే ఓటమి విలువ బాగా తెలుస్తుంది’
పాఠశాల విద్యలో క్రీడల్ని భాగం చేయాలని, అప్పుడే విద్యార్థులకు ఓటమి విలువేంటో ఆటలు నేర్పిస్తాయని టెన్నిస్ దిగ్గజం ఆండ్రీ అగస్సీ(Andre Agassi) చెప్పాడు. టీఐఈ (ద ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్) గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు భారత్‌కు విచ్చేశాడు ఈ అమెరికన్ మాజీ నంబర్‌వన్ టెన్నిస్ స్టార్. ఈ క్రమంలో క్రీడలతో భవిష్యత్తు, పాఠశాల విద్యపై తన అభిప్రాయాలు వెలిబుచ్చాడు.గెలుపోటములు మనకు పాఠాలు నేర్పుతాయి‘ఒకవేళ వైఫల్యం ఎదురైనా... తట్టుకొని నిలబడేందుకు, మళ్లీ మరుసటి రోజు వెంటనే ఆడేందుకు స్థయిర్యాన్ని క్రీడలే ఇస్తాయి. అందుకే చెబుతున్నా... క్రీడల్లోని గెలుపోటములు మనకు పాఠాలు నేర్పుతాయి. ఓడిన ప్రతీసారి గెలవడంపై మరింత దృష్టి పెట్టేలా చేస్తాయి. అంటే మెరుగయ్యేందుకు, ప్రగతి సాధించేందుకు దోహదం చేస్తాయి’ అని అగస్సీ వివరించాడు.కాగా అగస్సీ రెండు దశాబ్దాల క్రితమే బలహీనవర్గాల పిల్లలు చదువుకోవాలనే లక్ష్యంతో పాఠశాలలు నిర్మించాడు. 2001లో మొదలైన ఈ సంకల్పంతో అతను 130 పాఠశాలల్ని ఏర్పాటు చేసి 80 వేల మంది చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాడు. టెన్నిస్ క్రీడ వల్లే తాను ఇంతలా రాటుదేలానని చెప్పుకొచ్చాడు.స్పోర్ట్స్ అంటేనే సవాళ్లు...అంతేకాదు... ఆటలు ఆడటం వల్ల మానసిక, శారీరక స్థయిర్యం పెరిగి... జీవితానికి సరిపడా ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నానని అగస్సీ చెప్పాడు. ‘స్పోర్ట్స్ అంటేనే సవాళ్లు... వాటిని అధిగమించడం. అంటే సమస్యకు ఎదురీది పరిష్కరించుకోవడం. టెన్నిస్ నాకు అదే నేర్పించింది. సవాళ్లు ఎదురైన ప్రతీసారి నిలబడి ఎదుర్కోవాలన్న ధైర్యాన్ని అలవర్చింది.ఓడితే గెలిచేందుకు మరింత శ్రద్ధపెట్టాలన్న కసిని నాలో పెంచింది. పోరాటానికి అవసరమైన సాధన, సంపత్తిని సమకూర్చింది’ అని అగస్సీ పేర్కొన్నాడు. ప్రస్తుత విద్యలో టెక్నాలజీది ప్రముఖ పాత్రని అన్నాడు. అవసరమైన ప్రతి విద్యార్థి వ్యక్తిగత అభ్యాసానికి ఆధునిక టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతోందని చెప్పాడు. తన కెరీర్లో ఎనిమిది గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించిన 54 ఏళ్ల అగస్సీ 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో సింగిల్స్‌లో స్వర్ణ పతకం కూడా గెలిచాడు. 2001లో జర్మనీ దిగ్గజం స్టెఫీ గ్రాఫ్‌ను అగస్సీ పెళ్లి చేసుకున్నాడు. -
దిగ్గజ టెన్నిస్ కోచ్ అస్తమయం
ఆండ్రీ ఆగస్సీ, మరియా షరపోవా లాంటి ఆటగాళ్లను తీర్చిదిద్దిన దిగ్గజ టెన్నిస్ కోచ్ నిక్ బొల్లెట్టిరి(91) కన్నుమూశాడు. ఈ విషయాన్ని ఆయన స్థాపించిన ఐఎంజీ అకాడమీ సోమవారం రాత్రి ట్వీట్ చేసింది. వయో బారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నిక్ బొల్లెట్టిరి తుది శ్వాస విడిచినట్లు ఐఎంజీ తమ ప్రకటనలో స్పష్టం చేసింది. విషయం తెలుసుకున్న టెన్నిస్ మాజీ క్రీడాకారులు ఆయనకు సంతాపం తెలిపారు. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య(ఐటీఎఫ్) నిక్ బొల్లెట్టిరికి నివాళి అర్పించింది. ఇక టెన్నిస్ ఆటగాళ్లను తయారు చేయడమే లక్ష్యంగా నిక్ బొల్లెట్టిరి 1978లో ఫ్లోరిడా వేదికగా ఐఎంజీ అకాడమీ(IMG Academy) స్థాపించాడు. ఈ అకాడమీలో ఆండ్రీ అగస్సీ, మరియా షరపోవాల, వీనస్ విలియమ్స్, సెరెనా విలియమ్స్, బొరిస్ బెకర్ లాంటి దిగ్గజాలు శిక్షణ తీసుకున్నారు. టాప్-10లో కొనసాగిన ఆటగాళ్లంతా ఏదో ఒక సమయలో బొల్లెట్టిరి దగ్గర శిక్షణ తీసుకున్నవారే కావడం విశేషం. Nick Bollettieri, the legendary tennis coach and founder of Nick Bollettieri Tennis Academy, which served as the foundation for today’s IMG Academy, has passed away. He was 91 years old. 💙🤍 🔗: https://t.co/vvFnYHowKc pic.twitter.com/zJYem2SvF6 — IMG Academy (@IMGAcademy) December 5, 2022 -
ప్రత్యర్థి కోసం అభిమానిగా మారిన దిగ్గజం
'టెన్నిస్ సోగ్గాడు'గా అందరూ గుర్తుపెట్టుకునే అమెరికా ఆటగాడు ఆండ్రీ అగస్సీ. రెండు దశాబ్దాలపాటు టెన్నిస్ కు సేవలందించి ఆటకు రిటైర్మెంట్ ఇచ్చిన అగస్సీ మళ్లీ టెన్నిస్ కోర్టులో అడుగుపెట్టాడు. తమ అభిమాన ఆటగాడు పదేళ్ల తర్వాత మళ్లీ కోర్టులో కనిపించడంతో స్టేడియంలో సందడి వాతావరణం నెలకొంది. 2006లో యూఎస్ ఓపెన్ లో మూడో రౌండ్లో భాగంగా బెంజమిన్ బెకర్ చేతిలో ఒటమిపాలైన తర్వాత టెన్నిస్‌కు గుడ్ బై చెప్పాడు. యూఎస్ ఓపెన్ 1994, 1999లో నెగ్గిన అగస్సీ ఓవరాల్ గా 8 గ్రాండ్ స్లామ్స్ తో పాటు కెరీర్ స్లామ్ తన ఖాతాలో వేసుకున్న కొద్దిమందిలో ఒకడు. 1986లో ప్రొఫెషనల్ క్రీడాకారుడిగా మారిన అగస్సీ ప్రస్థానం 2006 వరకు సాగింది. అయితే తాజాగా జరుగుతున్న యూఎస్ ఓపెన్ సందర్భంగా మళ్లీ కోర్టులో అభిమానిగా మారిపోయాడు. ఇందుకు కారణం పదేళ్ల కిందట తనను ఓడించిన ప్రత్యర్థి ఆటను చూడాలని 46 ఏళ్ల అగస్సీ భావించడం. తొలి రౌండ్ మ్యాచ్ లోనే బెకర్ ఇంటిదారి పట్టడం గమనార్హం. పదేళ్లకింద అగస్సీని ఓడించిన మ్యాచ్ గురించి తనకు గుర్తులేదని 35 ఏళ్ల బెకర్ చెప్పాడు. అయితే చివర్లో మ్యాచ్ ఏస్ సంధించి మ్యాచ్ పాయింట్ తో సెట్ కైవసం చేసుకున్న విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. దిగ్గజ ఆటగాడి చివరి మ్యాచ్ తనతోనే కావడం తనకు చాలా గర్వంగా ఉందని బెకర్ చెప్పుకొచ్చాడు. ఇన్నేళ్ల తర్వాత కోర్టులో కనిపించిన తనకు 20వేల మంది ప్రేక్షకులు కరతాళధ్వనులతో స్వాగతం పలకడం తన జీవితంలోనే గొప్పరోజు అని అగస్సీ పేర్కొన్నాడు. -
జొకోవిచ్ కొత్త చరిత్ర
► 28 మాస్టర్స్ టైటిల్స్‌తో రికార్డు ఆరోసారి మయామి ఓపెన్ సొంతం ► అత్యధిక ప్రైజ్‌మనీ సంపాదించిన ప్లేయర్‌గా గుర్తింపు ఫ్లోరిడా: నిలకడైన ఆటతీరుకు మారుపేరైన సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ కొత్త చరిత్ర సృష్టించాడు. రికార్డుస్థాయిలో 28వ మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకొని ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మయామి ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 6-3, 6-4తో కీ నిషికోరి (జపాన్)పై గెలిచాడు. తద్వారా ఆరోసారి మయామి ఓపెన్ టైటిల్‌ను దక్కించుకొని అత్యధికసార్లు ఈ టైటిల్ నెగ్గిన ప్లేయర్‌గా ఆండ్రీ అగస్సీ (అమెరికా) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. 28 ఏళ్ల జొకోవిచ్ 2007, 2011, 2012, 2014, 2015లలో కూడా ఈ టైటిల్‌ను సాధించాడు. మయామి టైటిల్ సాధించినందుకు జొకోవిచ్‌కు 1000 ర్యాంకింగ్ పాయింట్లతోపాటు 10 లక్షల 28 వేల 300 డాలర్ల (రూ. 6 కోట్ల 79 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. తాజా విజయంతో రాఫెల్ నాదల్ (స్పెయిన్-27 టైటిల్స్)ను వెనక్కి నెట్టి అత్యధిక మాస్టర్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుడిగా జొకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా ఏటీపీ సర్క్యూట్లో అత్యధిక ప్రైజ్‌మనీ సంపాదించిన ప్లేయర్‌గా కూడా ఈ సెర్బియా స్టార్ నిలిచాడు. ఇప్పటివరకు కెరీర్లో 63 సింగిల్స్ టైటిల్స్‌ను సాధించిన జొకోవిచ్ 9 కోట్ల 81 లక్షల 99 వేల 548 డాలర్లు (రూ. 648 కోట్లు) సంపాదించాడు. ఈ టోర్నీకి ముందు 9 కోట్ల 78 లక్షల 55 వేల 881 డాలర్లతో (రూ. 646 కోట్లు) అగ్రస్థానంలో ఉన్న రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) రెండో స్థానానికి పడిపోయాడు. ఈ గెలుపుతో జొకోవిచ్ తన కెరీర్లో 714వ విజయంతో అత్యధిక విజయాలు సాధించిన క్రీడాకారుల జాబితాలో తనకోచ్, జర్మనీ దిగ్గజం బోరిస్ బెకర్‌ను దాటి 11వ స్థానానికి చేరుకున్నాడు. -
పడి లేచారు..!
పంచామృతం: ఇక అయిపోయిందనుకున్నారంతా. కోలుకోవడం కష్టమే.. అనే అభిప్రాయాలూ వినిపించాయి. గతంలో ఎంతో వైభవాన్ని చూశారు... రకరకాల కారణాలతో విరామం లేదా, వైఫల్యాల వల్ల కొంత ఇబ్బందిని కూడా ఎదుర్కొన్నారు. అయితే తిరిగి బంతిలాగా దూసుకురావడమే వీరి గొప్పదనం. మళ్లీ తమ సత్తా, స్థాయి ఏమిటో చూపిస్తున్నారు. వీరు వ్యక్తిగతంగా వెలుగుతున్నవారే కాదు, వర్తమానంలో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి స్ఫూర్తిప్రదాతలు కూడా! అమితాబ్ బచ్చన్ ఈ సూపర్‌స్టార్ కమ్‌బ్యాక్ ఒక వ్యక్తిత్వ వికాస పాఠమే అవుతుంది. సినిమాల ఫెయిల్యూర్లు, ఏబీసీఎల్ నష్టాలు అమితాబ్ కథ అయిపోయిందనిపించాయి. ఆ సమయంలో అమితాబ్ అప్పుల పద్దు గురించి మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. అయితే అమితాబ్ అలాంటి దశను అధిగమించాడు. కౌన్‌బనేగా కరోడ్‌పతి ద్వారా, సినిమాల ద్వారా తన స్థాయి ఏమిటో తెలియజెప్పాడు! నితిన్ వరస ఫెయిల్యూర్లు... కొన్ని సినిమాలు అయితే ఎప్పుడొచ్చి వెళ్లాయో కూడా చాలామందికి తెలియని పరిస్థితి. తొలి సినిమాతోనే టాలీవుడ్లో మంచి గుర్తింపు సొంతం చేసుకొన్న నితిన్‌ను మధ్యలో కొన్ని రోజులు వరసగా వైఫల్యాలు వెంబడించాయి. అయితేనేం.. ‘ఇష్క్’తో మళ్లీ నితిన్టైమ్ స్టార్ట్ అయ్యింది. ఫామ్‌లోకి వచ్చిన బ్యాట్స్‌మన్‌లా ఇప్పుడు చెలరేగుతున్నాడు ఈ హీరో! సల్మాన్ ఖాన్ వరస వివాదాలు.. పోలీస్ కేసులు, చెడ్డపేరు... దాదాపు దశాబ్దం కిందట సల్మాన్ పరిస్థితి ఇది. బాలీవుడ్ బ్యాడ్‌బాయ్ ఇమేజ్ను తెచ్చేసుకున్నాడు ఈ హీరో. ఇండస్ట్రీకి హిట్స్‌ను ఇచ్చి ఎంతో అభిమానగణాన్ని సంపాదించుకొన్న సల్మాన్... తాగి కారు నడిపిన కేసులో, కృష్ణజింకలను వేటాడిన కేసులోనూ దోషిగా ఉన్నాడు. ఇలాంటి ఇబ్బందికరమైన దశను తన సినిమాల ద్వారానే సల్లూ అధిగమించాడు. కేసులు కొనసాగుతున్నా... సినిమాల ద్వారా అలరిస్తూ అభిమానుల మనసులను అయితే గెలుచుకున్నాడు. టైగర్ వుడ్స్ దాదాపు ఐదేళ్ల క్రితం అమెరికన్ గోల్ఫ్ ఆటగాడు టైగర్ వుడ్స్ తీవ్ర మైన వివాదాల్లో కూరుకున్నాడు. ఎంతో అభిమానగణాన్ని కలిగిన వుడ్స్పై తీవ్రమైన ఆరోపణలు వినిపించాయి. అనేక మంది మహిళలు ‘మాకు వుడ్స్‌తో లైంగిక సంబంధముంది’ అని ప్రకటించుకున్నారు. కొన్ని నెలల పాటు వుడ్స్ శృంగారలీలలు అమెరికన్, ప్రపంచ మీడియాకు మంచి మేత అయ్యాయి. అలాంటి వార్తలు వుడ్స్ వ్యక్తిగత, క్రీడాజీవితాలను దెబ్బతీశాయి. ఎండార్స్మెంట్ ఆదాయంపై కూడా దెబ్బకొట్టాయి. అయితే అదంతా గతం. ఇప్పుడు.. వుడ్స్ ఆటలో మళ్లీ చాంపియన్. ఎండార్స్మెంట్ విషయంలో కూడా! ఆండ్రీ అగస్సీ 1992లో అందుకొన్న తొలి టైటిల్‌తో అగస్సీ ప్రభ మొదలైంది. అయితే కెరీర్ ఆరంభంలో టాప్‌టెన్ స్థాయి ర్యాంకింగ్స్‌లో ఉన్న అగస్సీ ర్యాంక్ ఒకదశలో 141కి పడిపోయిందంటే ఆశ్చర్యం కలగకమానదు. కుటుంబపరమైన సమస్యలు, ఫామ్‌లేమి కలసి 1997ల నాటికి అగస్సీ కథ అయిపోయిందనే అభిప్రాయాన్ని కలిగించాయి. అయితేనేం.. లెజెండరీ ఆటగాడు మళ్లీ పంజా విసిరాడు. 1999 తర్వాత వరుసగా నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచి గ్రాండ్‌గా టెన్నిస్ నుంచి విరామం తీసుకొన్నాడు. -
రహస్య ఇష్టమే కారణం!
మై ఫేవరెట్ బుక్: విరాట్ కోహ్లీ, క్రికెటర్ టెన్నిస్ లెజెండ్ ఆండ్రూ అగస్సీ ఆటోబయోగ్రఫీ ‘ఓపెన్’ అంటే ఇష్టం. పుస్తకంలో నాకు బాగా నచ్చే విషయం ఏమిటంటే, అగస్సీ తనను తాను ఎక్కడా ‘సూపర్‌మ్యాన్’గా ప్రదర్శించుకోలేదు. ‘నేనూ మీ లాంటి వాడినే’ అని చెబుతున్నట్లుగా ఉంటుంది. అతిశయం ఎక్కడా కనిపించదు. కెరీర్లో అనేక ఎత్తుపల్లాలను చూసిన అగస్సీ లాంటి ఛాంపియన్ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు, స్ఫూర్తి పొందాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. పుస్తకం చదువుతున్నంత సేపు ఆయన మనతో ఉన్నట్లే అనిపిస్తుంది. ఒక వ్యక్తి ఉన్నత శిఖరాలకు చేరాలంటే ఎంత అంకితభావం, త్యాగం అవసరమో ఈ పుస్తకం చదువుతున్న క్రమంలో మనకు అర్థమవుతుంది. చేసిన పొరపాట్లకు పశ్చాత్తాప పడడం గొప్ప విషయం. ఈ లక్షణం అగస్సీలో ఉంది. కొందరు సొంతంగా ఇష్టపడి ఆటలోకి వస్తారు. కొందరు పెద్దల నిర్ణయం ప్రకారం అయిష్టంగా వస్తారు. ఆటను ఇష్టపడిన వారే విజేతలుగా నిలుస్తారు. నిజానికి తండ్రి బలవంతం మీద టెన్నిస్‌ను అనిష్టంగా నేర్చుకున్నాడు అగస్సీ. అనిష్టంగానే సాధన చేసేవాడు. అలా అనిష్టంగా ఆడినా, అతనిలో ఎక్కడో ఒక చోట ‘రహస్యంగా ఇష్టం’ ఏర్పడింది. ఆ ఇష్టమే అగస్సీని టెన్నిస్ చరిత్రలో ప్రఖ్యాతుడిని చేసింది. టెన్నిస్‌ను ఇష్టపడే వారే కాదు, అగస్సీ వీరాభిమానులు మాత్రమే కాదు...అన్ని వర్గాల వారూ చదవాల్సిన స్ఫూర్తిదాయక పుస్తకం ఇది. -
‘సోగ్గాడి’ విజయం వెనక....
ఆండ్రీ అగస్సీ... ఎనిమిది గ్రాండ్‌స్లామ్ టైటిల్స్, ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన టెన్నిస్ స్టార్. సోగ్గాడుగా అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. స్టెఫీగ్రాఫ్‌ను పెళ్లి చేసుకున్నాడు. ప్రపంచంలో అన్ని మూలలా పెద్ద సెలబ్రిటీ హోదా... కానీ వీటన్నింటి వెనక, ఈ విజయం వెనక పెద్ద కష్టాన్నే అధిగమించిన ధైర్యం, ధీరత్వం ఉన్నాయి. అందరికీ తెలిసిన అగస్సీ అరుదైన కెరీర్‌స్లామ్ సాధించిన ఐదుగురు ఆటగాళ్లలో ఒకడు. తన ఆటతీరుతోనేగాక, భిన్నమైన ఆహార్యంతో అభిమానుల్ని అలరించిన అందగాడు. కానీ.. అగస్సీ జీవితంలో మరో కోణముంది. అదే.. స్పాండిలిస్తియాసిస్. ఈ వ్యాధి ఉన్నవారికి వెన్నెముక కింది భాగాన ఉన్న నరాల మధ్య గ్యాప్ తక్కువగా ఉండి, నడుస్తున్నప్పుడు నరాలు ఒకదానికొకటి తగిలి తీవ్రమైన నొప్పి కలుగుతుంది. నిటారుగా నిలబడలేరు. చక్కగా నడవలేరు. ఇక గెంతడం, పరుగులు పెట్టడం గురించి చెప్పాల్సిన పనేలేదు. క్రీడాకారుడు కావాలనుకున్న ఎవరికైనా ఈ వ్యాధి ఉన్నట్లు తెలిస్తే సహజంగా ఆ ఆలోచనే విరమించుకుంటారు. బుద్ధిగా చదువుకొని ఏ ఉద్యోగంలోనో స్థిరపడాలనుకుంటారు. కానీ, అగస్సీ అలా చేయలేదు. కసితో ముందుకు సాగాడు. కఠోర సాధనతో సమస్యను దూరంగా పారదోలాడు. పసి ప్రాయంలోనే.. మాజీ బాక్సింగ్ చాంపియన్ మైక్ అగస్సీకి ముగ్గురు సంతానంలో చిన్నవాడిగా జన్మించిన ఆండ్రీ అగస్సీని టెన్నిస్ స్టార్ చేయాలని చిన్నప్పుడే నిర్ణయించాడు తండ్రి. ఇందుకోసం పసిప్రాయంలోనే రాకెట్ చేతికందించాడు. బాలుడైన ఆండ్రీతో సామర్థ్యానికి మించిన కసరత్తులు చేయించాడు. తొమ్మిదేళ్ల వయసులోనే అతని కన్నా ఎన్నో ఏళ్లు పెద్దవారైన ఆటగాళ్లతో ఆడించాడు. బహుశా! ఇంతటి కఠినమైన పరిస్థితులే ఆండ్రీని రాటుదేల్చివుంటాయేమో. 13 ఏళ్ల బాలుడుగా ఉన్నప్పుడు టెన్నిస్ కోచింగ్ అకాడమీలో చేరాడు. అక్కడ అగస్సీ ఆటతీరు గమనించిన శిక్షకుడు అతనికి ఫీజు కూడా అక్కర్లేదని ఉచితంగా శిక్షణ ఇచ్చాడు. అకాడమీ నుంచి బయటికి వచ్చాక జూనియర్ స్థాయి నుంచి 1986లో ప్రొఫెషనల్ క్రీడాకారుడిగా మారాడు. ఆ ప్రస్థానం 2006 వరకు సాగింది. కానీ, ఈ ఇరవై ఏళ్ల కెరీర్లో అగస్సీ ముళ్లబాటలోనే నడిచాడు. నిద్రలేని రాత్రులు.. 16 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్ ఆటగాడిగా.. ఆడిన తొలిమ్యాచ్‌లోనే విజయం సాధించిన అగస్సీ ఆపై ఎన్నో విజయాలు చవిచూశాడు. దిగ్గజాలను ఓడించిన ఆనందం వెనుక ఎంతో విషాదం ఉంది. స్పాండిలోలైతిస్ కారణంగా వచ్చే నొప్పితో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. నిలబడినా, కూర్చున్నా, పడుకున్నా ఏం చేసినా భరించలేని నొప్పి. రాత్రిపూట బెడ్‌పై ఎక్కువసేపు పడుకోలేకపోయేవాడు. మధ్యరాత్రి నేలపైకి మారేవాడు. తలను చిన్నపిల్లాడిలా పొట్టలో పెట్టుకొని దగ్గరికి ముడుచుకునేవాడు. తెల్లవారితే ఒక్కసారిగా లేవలేకపోయేవాడు. అందుకోసం వన్, టూ, త్రీ.. అంటూ అంకెలు లెక్కపెట్టుకొని శక్తినంతా కూడదీసుకొని లేచి నిలబడేవాడు. ఆపై ప్రతి పనికీ ముందు అగస్సీ తన శరీరంతో పెద్ద కుస్తీయే పట్టాల్సివచ్చేది. అలాంటి స్థితి నుంచి కోర్టులో అడుగుపెట్టాక తనదైన షాట్లతో విరుచుకుపడేవాడు. కోర్టులో ఎక్కువగా వెనక్కి జరుగుతూ ఆడడం ద్వారా తన లోపాన్ని అధిగమించేవాడు. ఎనిమిది గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గిన అగస్సీకి ఈ సమస్య ఉన్నట్లు ఎవరికీ తెలియలేదు. చివరికి 2006లో యూఎస్ ఓపెన్ మూడోరౌండ్లో ఓడిపోయి రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంగా తానే స్వయంగా ఈ విషయం వెల్లడించాడు. - కంచర్ల శ్యాంసుందర్