రహస్య ఇష్టమే కారణం!
మై ఫేవరెట్ బుక్: విరాట్ కోహ్లీ, క్రికెటర్
టెన్నిస్ లెజెండ్ ఆండ్రూ అగస్సీ ఆటోబయోగ్రఫీ ‘ఓపెన్’ అంటే ఇష్టం. పుస్తకంలో నాకు బాగా నచ్చే విషయం ఏమిటంటే, అగస్సీ తనను తాను ఎక్కడా ‘సూపర్‌మ్యాన్’గా ప్రదర్శించుకోలేదు. ‘నేనూ మీ లాంటి వాడినే’ అని చెబుతున్నట్లుగా ఉంటుంది. అతిశయం ఎక్కడా కనిపించదు.
కెరీర్‌లో అనేక ఎత్తుపల్లాలను చూసిన అగస్సీ లాంటి ఛాంపియన్ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు, స్ఫూర్తి పొందాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. పుస్తకం చదువుతున్నంత సేపు ఆయన మనతో ఉన్నట్లే అనిపిస్తుంది. ఒక వ్యక్తి ఉన్నత శిఖరాలకు చేరాలంటే ఎంత అంకితభావం, త్యాగం అవసరమో ఈ పుస్తకం చదువుతున్న క్రమంలో మనకు అర్థమవుతుంది. చేసిన పొరపాట్లకు పశ్చాత్తాప పడడం గొప్ప విషయం. ఈ లక్షణం అగస్సీలో ఉంది.
కొందరు సొంతంగా ఇష్టపడి ఆటలోకి వస్తారు. కొందరు పెద్దల నిర్ణయం ప్రకారం అయిష్టంగా వస్తారు. ఆటను ఇష్టపడిన వారే విజేతలుగా నిలుస్తారు. నిజానికి తండ్రి బలవంతం మీద టెన్నిస్‌ను అనిష్టంగా నేర్చుకున్నాడు అగస్సీ. అనిష్టంగానే సాధన చేసేవాడు. అలా అనిష్టంగా ఆడినా, అతనిలో ఎక్కడో ఒక చోట ‘రహస్యంగా ఇష్టం’ ఏర్పడింది. ఆ ఇష్టమే అగస్సీని టెన్నిస్ చరిత్రలో ప్రఖ్యాతుడిని చేసింది.
టెన్నిస్‌ను ఇష్టపడే వారే కాదు, అగస్సీ వీరాభిమానులు మాత్రమే కాదు...అన్ని వర్గాల వారూ చదవాల్సిన స్ఫూర్తిదాయక పుస్తకం ఇది.