ప్రత్యర్థి కోసం అభిమానిగా మారిన దిగ్గజం
'టెన్నిస్ సోగ్గాడు'గా అందరూ గుర్తుపెట్టుకునే అమెరికా ఆటగాడు ఆండ్రీ అగస్సీ. రెండు దశాబ్దాలపాటు టెన్నిస్ కు సేవలందించి ఆటకు రిటైర్మెంట్ ఇచ్చిన అగస్సీ మళ్లీ టెన్నిస్ కోర్టులో అడుగుపెట్టాడు. తమ అభిమాన ఆటగాడు పదేళ్ల తర్వాత మళ్లీ కోర్టులో కనిపించడంతో స్టేడియంలో సందడి వాతావరణం నెలకొంది. 2006లో యూఎస్ ఓపెన్ లో మూడో రౌండ్లో భాగంగా బెంజమిన్ బెకర్ చేతిలో ఒటమిపాలైన తర్వాత టెన్నిస్కు గుడ్ బై చెప్పాడు. యూఎస్ ఓపెన్ 1994, 1999లో నెగ్గిన అగస్సీ ఓవరాల్ గా 8 గ్రాండ్ స్లామ్స్ తో పాటు కెరీర్ స్లామ్ తన ఖాతాలో వేసుకున్న కొద్దిమందిలో ఒకడు. 1986లో ప్రొఫెషనల్ క్రీడాకారుడిగా మారిన అగస్సీ ప్రస్థానం 2006 వరకు సాగింది.
అయితే తాజాగా జరుగుతున్న యూఎస్ ఓపెన్ సందర్భంగా మళ్లీ కోర్టులో అభిమానిగా మారిపోయాడు. ఇందుకు కారణం పదేళ్ల కిందట తనను ఓడించిన ప్రత్యర్థి ఆటను చూడాలని 46 ఏళ్ల అగస్సీ భావించడం. తొలి రౌండ్ మ్యాచ్ లోనే బెకర్ ఇంటిదారి పట్టడం గమనార్హం. పదేళ్లకింద అగస్సీని ఓడించిన మ్యాచ్ గురించి తనకు గుర్తులేదని 35 ఏళ్ల బెకర్ చెప్పాడు. అయితే చివర్లో మ్యాచ్ ఏస్ సంధించి మ్యాచ్ పాయింట్ తో సెట్ కైవసం చేసుకున్న విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. దిగ్గజ ఆటగాడి చివరి మ్యాచ్ తనతోనే కావడం తనకు చాలా గర్వంగా ఉందని బెకర్ చెప్పుకొచ్చాడు. ఇన్నేళ్ల తర్వాత కోర్టులో కనిపించిన తనకు 20వేల మంది ప్రేక్షకులు కరతాళధ్వనులతో స్వాగతం పలకడం తన జీవితంలోనే గొప్పరోజు అని అగస్సీ పేర్కొన్నాడు.