అల్‌కరాజ్‌పై అతిగా అంచనాలు వద్దు ∙టెన్నిస్ దిగ్గజం ఆండ్రీ అగస్సీ వ్యాఖ్య
బెంగళూరు: ప్రస్తుతం ప్రపంచ టెన్నిస్‌లో ప్రతిభావంతుడైన యువ ఆటగాళ్లలో స్పెయిన్ ప్లేయర్ కార్లోస్ అల్‌కరాజ్ ఒకడు. నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన అతను ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్నాడు. అయితే అల్‌కరాజ్ ఆట గురించి టెన్నిస్ దిగ్గజం ఆండ్రీ అగస్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వేర్వేరు అంశాలపరంగా ముగ్గురు స్టార్లు జొకోవిచ్, రాఫెల్ నాదల్, రోజర్ ఫెడరర్‌లాంటి ఆట అతనిలో కనిపిస్తున్నా... వారిలా గొప్ప ఘనతలు సాధించలేడని అగస్సీ అభిప్రాయపడ్డాడు. ఈ ముగ్గురు దిగ్గజాలు వరుసగా 23, 22, 20 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గారు. ‘జొకోవిచ్ తరహా డిఫెన్స్, నాదల్‌లాంటి పవర్ గేమ్, ఫెడరర్‌లా చూడచక్కని ఆటను అల్‌కరాజ్ కూడా ప్రదర్శించాడు.
అయితే ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన వారిలా అతను పెద్ద విజయాలు సాధించడం కష్టం. నేను జ్యోతిష్యం చెప్పేవాడిని కాదు కానీ టెన్నిస్ అలాంటి ఘనతలు అందుకోవాలంటే ఎన్నో కలిసి రావాలి. వ్యూహాలు, గాయాలు లేకపోవడంతో పాటు అదృష్టం కూడా ఉండాలి’ అని అగస్సీ వ్యాఖ్యానించాడు. మరోవైపు కెరీర్ చరమాంకంలో ఉన్న 37 ఏళ్ల జొకోవిచ్ ఇకపై అదే దూకుడు కొనసాగించలేడని కూడా అతను అన్నాడు. తాను అత్యుత్తమ స్థాయికి చేరే క్రమంలో ఎదురైన ముగ్గురు అద్భుత ప్రత్యర్థులు తప్పుకున్న తర్వాత అలాంటి ఆట కనిపించదని అగస్సీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘జొకోవిచ్ ఇప్పటికే కెరీర్‌లో చాలా సాధించాడు. అతని శక్తియుక్తులన్నీ సహజంగానే బలహీనంగా మారిపోతాయి.
నా అభిప్రాయం ప్రకారం ఎదురుగా ప్రత్యరి్థని చూస్తే చాలు ఇంకా సాధించాలనే ప్రేరణ లభిస్తే విజయాలు దక్కుతాయి. తాను చరిత్ర సృష్టంచడంలో భాగమైన ఆ ముగ్గురు ఇప్పటికే తప్పుకున్నారు. పీట్ సంప్రాస్ రిటైరయ్యాక నాకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. దీని నుంచి ముందుకు సాగాలంటే మానసికంగా చాలా దృఢంగా ఉండాలి. జొకోవిచ్‌లో అలాంటిది ఉందా అనేది ఆసక్తికరం’ అని అగస్సీ వివరించాడు.
తనకు ప్రత్యర్థిగా ఆడిన ఆండీ ముర్రే ఇప్పుడు కోచ్‌గా మారడం జొకోవిచ్‌కు సానుకూలతే అయినా... ఫలితాలు పరస్పర నమ్మకంతోనే వస్తాయని, అది అంత సులువు కాదని ఎనిమిది గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన అగస్సీ విశ్లేíÙంచాడు. 1980ల్లో, 1990ల్లో ప్రపంచ టెన్నిస్‌కు అమెరికా ఆటగాళ్లు శాసించిన విషయాన్ని గుర్తు చేస్తూ అగస్సీ... భవిష్యత్తులో అలాంటి మంచి రోజులు అమెరికాకు మళ్లీ వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆ సమయంలో తనతో పాటు సంప్రాస్, జిమ్ కొరియర్, మైకేల్ చాంగ్ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగామని వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment