‘సోగ్గాడి’ విజయం వెనక....
ఆండ్రీ అగస్సీ... ఎనిమిది గ్రాండ్‌స్లామ్ టైటిల్స్, ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన టెన్నిస్ స్టార్. సోగ్గాడుగా అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. స్టెఫీగ్రాఫ్‌ను పెళ్లి చేసుకున్నాడు. ప్రపంచంలో అన్ని మూలలా పెద్ద సెలబ్రిటీ హోదా... కానీ వీటన్నింటి వెనక, ఈ విజయం వెనక పెద్ద కష్టాన్నే అధిగమించిన ధైర్యం, ధీరత్వం ఉన్నాయి.
అందరికీ తెలిసిన అగస్సీ అరుదైన కెరీర్‌స్లామ్ సాధించిన ఐదుగురు ఆటగాళ్లలో ఒకడు. తన ఆటతీరుతోనేగాక, భిన్నమైన ఆహార్యంతో అభిమానుల్ని అలరించిన అందగాడు. కానీ.. అగస్సీ జీవితంలో మరో కోణముంది. అదే.. స్పాండిలిస్తియాసిస్. ఈ వ్యాధి ఉన్నవారికి వెన్నెముక కింది భాగాన ఉన్న నరాల మధ్య గ్యాప్ తక్కువగా ఉండి, నడుస్తున్నప్పుడు నరాలు ఒకదానికొకటి తగిలి తీవ్రమైన నొప్పి కలుగుతుంది. నిటారుగా నిలబడలేరు. చక్కగా నడవలేరు. ఇక గెంతడం, పరుగులు పెట్టడం గురించి చెప్పాల్సిన పనేలేదు. క్రీడాకారుడు కావాలనుకున్న ఎవరికైనా ఈ వ్యాధి ఉన్నట్లు తెలిస్తే సహజంగా ఆ ఆలోచనే విరమించుకుంటారు. బుద్ధిగా చదువుకొని ఏ ఉద్యోగంలోనో స్థిరపడాలనుకుంటారు. కానీ, అగస్సీ అలా చేయలేదు. కసితో ముందుకు సాగాడు. కఠోర సాధనతో సమస్యను దూరంగా పారదోలాడు.
పసి ప్రాయంలోనే..
మాజీ బాక్సింగ్ చాంపియన్ మైక్ అగస్సీకి ముగ్గురు సంతానంలో చిన్నవాడిగా జన్మించిన ఆండ్రీ అగస్సీని టెన్నిస్ స్టార్ చేయాలని చిన్నప్పుడే నిర్ణయించాడు తండ్రి. ఇందుకోసం పసిప్రాయంలోనే రాకెట్ చేతికందించాడు. బాలుడైన ఆండ్రీతో సామర్థ్యానికి మించిన కసరత్తులు చేయించాడు. తొమ్మిదేళ్ల వయసులోనే అతని కన్నా ఎన్నో ఏళ్లు పెద్దవారైన ఆటగాళ్లతో ఆడించాడు. బహుశా! ఇంతటి కఠినమైన పరిస్థితులే ఆండ్రీని రాటుదేల్చివుంటాయేమో. 13 ఏళ్ల బాలుడుగా ఉన్నప్పుడు టెన్నిస్ కోచింగ్ అకాడమీలో చేరాడు. అక్కడ అగస్సీ ఆటతీరు గమనించిన శిక్షకుడు అతనికి ఫీజు కూడా అక్కర్లేదని ఉచితంగా శిక్షణ ఇచ్చాడు. అకాడమీ నుంచి బయటికి వచ్చాక జూనియర్ స్థాయి నుంచి 1986లో ప్రొఫెషనల్ క్రీడాకారుడిగా మారాడు. ఆ ప్రస్థానం 2006 వరకు సాగింది. కానీ, ఈ ఇరవై ఏళ్ల కెరీర్‌లో అగస్సీ ముళ్లబాటలోనే నడిచాడు.
నిద్రలేని రాత్రులు..
16 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్ ఆటగాడిగా.. ఆడిన తొలిమ్యాచ్‌లోనే విజయం సాధించిన అగస్సీ ఆపై ఎన్నో విజయాలు చవిచూశాడు. దిగ్గజాలను ఓడించిన ఆనందం వెనుక ఎంతో విషాదం ఉంది. స్పాండిలోలైతిస్ కారణంగా వచ్చే నొప్పితో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. నిలబడినా, కూర్చున్నా, పడుకున్నా ఏం చేసినా భరించలేని నొప్పి. రాత్రిపూట బెడ్‌పై ఎక్కువసేపు పడుకోలేకపోయేవాడు. మధ్యరాత్రి నేలపైకి మారేవాడు. తలను చిన్నపిల్లాడిలా పొట్టలో పెట్టుకొని దగ్గరికి ముడుచుకునేవాడు. తెల్లవారితే ఒక్కసారిగా లేవలేకపోయేవాడు.
అందుకోసం వన్, టూ, త్రీ.. అంటూ అంకెలు లెక్కపెట్టుకొని శక్తినంతా కూడదీసుకొని లేచి నిలబడేవాడు. ఆపై ప్రతి పనికీ ముందు అగస్సీ తన శరీరంతో పెద్ద కుస్తీయే పట్టాల్సివచ్చేది. అలాంటి స్థితి నుంచి కోర్టులో అడుగుపెట్టాక తనదైన షాట్లతో విరుచుకుపడేవాడు. కోర్టులో ఎక్కువగా వెనక్కి జరుగుతూ ఆడడం ద్వారా తన లోపాన్ని అధిగమించేవాడు. ఎనిమిది గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గిన అగస్సీకి ఈ సమస్య ఉన్నట్లు ఎవరికీ తెలియలేదు. చివరికి 2006లో యూఎస్ ఓపెన్ మూడోరౌండ్‌లో ఓడిపోయి రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంగా తానే స్వయంగా ఈ విషయం వెల్లడించాడు.
- కంచర్ల శ్యాంసుందర్