
ఒలింపిక్స్‌కు దూరమే!
►ఆసక్తి చూపించని బీసీసీఐ
►సీఓఏతో సమావేశంలో చర్చ
►ఇక నుంచి సెలక్టర్లకూ నగదు ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాలు దాదాపుగా లేనట్లే! భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పెద్దలకు ఇది ఇష్టం లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. బుధవారం జరిగిన బీసీసీఐ ఆఫీస్ బేరర్లు, క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) సమావేశంలో దీనిపై విస్తృతంగా చర్చ జరిగినా సభ్యులు ఎలాంటి నిర్ణయానికి రాలేకపోయారు. త్వరలో జరిగే బోర్డు సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని మాత్రం ఈ భేటీలో తీర్మానించారు. అయితే బోర్డు వర్గాల సమాచారం ప్రకారం... ఒలింపిక్స్‌లో పాల్గొనకూడదనే తమ ఆలోచనలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని తెలుస్తోంది.
‘ఒలింపిక్స్‌లో పాల్గొనాలంటే ఒలింపిక్ చార్టర్‌ను ఆమోదించాల్సి ఉంటుంది. అప్పుడు ప్రభుత్వ పరిధిలోని ఒక జాతీయ క్రీడా సమాఖ్యగా బీసీసీఐ మారిపోవాలి. పైగా నిబంధనల ప్రకారం ‘వాడా’ పరిధిలోకి కూడా రావాలి. దీనికి మన క్రికెటర్లు కూడా వ్యతిరేకం. ఇలాంటి సమస్యల మధ్య మేం ఒలింపిక్స్‌లో భాగం కావాలని అనుకోవడం లేదు’ అని బోర్డు ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. చాలా కాలంగా ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్పించేందుకు ఐసీసీ ప్రయత్నం చేస్తున్నా కేవలం బీసీసీఐ అనాసక్తి కారణంగా ఈ అంశం లో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
రూ. 15 లక్షల చొప్పున...
బీసీసీఐ–సీఓఏ సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవల చాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్‌కప్‌లలో ఫైనల్‌కు చేరుకున్న పురుషుల, మహిళల జట్లను ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీలకు కూడా నగదు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. కమిటీలలోని ఒక్కో సభ్యుడికి రూ. 15 లక్షల చొప్పున నజరానా అందజేస్తారు. దేశవాళీ ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులు పెంచే అంశంపై బోర్డు కోశాధికారి విధి విధానాలు రూపొందిస్తున్నారని సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ వెల్లడించారు. ఐపీఎల్ ముగిసిన తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌ల కోసం కనీసం 15 రోజుల విరామం ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు.
భారత ‘ఎ’, అండర్–19 జట్లకు ప్రత్యేకంగా మేనేజర్‌ను ఎంపిక చేయాల్సిన అవసరం లేదని భావించిన బీసీసీఐ... పేసర్ శ్రీశాంత్‌కు సంబంధించి కేరళ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అంశంలో న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని నిర్ణయించింది. మరోవైపు వ్యాఖ్యాతలుగా భారీ ఆదాయం పొందుతున్న సునీల్ గావస్కర్, సంజయ్ మంజ్రేకర్, మురళీ కార్తీక్, హర్షా భోగ్లే తాము లోధా కమిటీ సిఫారసుల ప్రకారం ‘కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్’ పరిధిలోకి రావడం లేదని స్వయంగా హామీ పత్రం అందజేయాలని కూడా ఈ సమావేశంలో తీర్మానించారు.
అజహర్ అంశం జనరల్ బాడీకే...
బీసీసీఐ నుంచి తనకు రావాల్సిన బకాయిలు, ఆర్థిక పరమైన ప్రయోజనాలు అందజేయాలంటూ మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ రాసిన లేఖపై బుధవారం బోర్డు సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. అయితే దీనిపై కూడా బీసీసీఐ–సీఓఏ ఎలాంటి నిర్ణయానికి రాలేకపోయింది. ‘అజహర్ అంశాన్ని మేం తీవ్రంగా చర్చించాం. మా న్యాయ నిపుణులు కూడా తమ సూచనలు ఇచ్చారు. అయితే దీనిపై తుది నిర్ణయం సర్వసభ్య సమావేశంలోనే తీసుకోవాలని తీర్మానించాం’ అని బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా చెప్పారు.
వినోద్‌రాయ్, డయానా ఎడుల్జీ