ఒకసారి ధోని వీడ్కోలు చెబితే..
కోల్కతా: భారత క్రికెట్ జట్టును ఉన్నతస్థానంలో నిలపడంలో కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని తనదైన ముద్రను వేశాడు. ఇప్పటికే టెస్టు మ్యాచ్లకు వీడ్కోలు చెప్పిన ధోని.. ప్రస్తుతం పరిమిత ఓవర్ల కెప్టెన్ గా మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే ధోని ఒకసారి భారత క్రికెట్ నుంచి దూరమైతే ఆ వెలితి పూడ్చలేనిదని అంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డీన్ జోన్స్. తన క్రికెట్ జీవితానికి ధోని ముగింపు పలికితే భారత క్రికెట్ చాలా కోల్పోతుందన్నాడు.
' భారత్ క్రికెట్ కు ధోని చాలా చేశాడు. వీడ్కోలుపై నిర్ణయాన్ని ధోనికే వదిలేయండి. మనకున్న గొప్ప ఆటగాళ్లను బలవంతంగా బయటకు పంపుతూనే ఉన్నాం. ప్రస్తుతం ధోని కెప్టెన్సీపై ఒత్తిడి అనేది ఉండకూడదు. టెస్టు కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన విరాట్ కోహ్లిని అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ గా చేసే సమయం ఇంకా రాలేదనేది నా అభిప్రాయం. ఇంకా అందుకు సమయం ఉంది. నిజంగా ధోని సేవల్ని కోల్పోతే భారత్ క్రికెట్ జట్టు చాలా కోల్పోతుంది 'అని జోన్స్ తెలిపాడు. ఏదొక రోజు ధోని క్రికెట్ కు వీడ్కోలు చెప్పే సమయం వస్తుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. అయితే అప్పటివరకూ భారత క్రికెట్ పెద్దలు వేచి చూడక తప్పదని జోన్స్ అన్నాడు. అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన ధోనిలాంటి ఆటగాడ్ని భారత్ ఎప్పటీ తేలేదని జోన్స్ పేర్కొన్నాడు.