ఇక ధనాధన్‌లో అమీతుమీ | The New Zealand ODI series is an easy to win India | Sakshi
Sakshi News home page

ఇక ధనాధన్‌లో అమీతుమీ

Published Wed, Feb 6 2019 2:00 AM | Last Updated on Wed, Feb 6 2019 10:55 AM

The New Zealand ODI series is an easy to win India - Sakshi

అందరూ ఊహించిన దానికంటే భిన్నంగా న్యూజిలాండ్‌ గడ్డపై వన్డే సిరీస్‌ను సునాయాసంగా గెల్చుకున్న టీమిండియా... అదే ఆత్మ విశ్వాసంతో టి20ల్లోనూ దుమ్ము రేపేందుకు సిద్ధమవుతోంది. ఇక్కడ ఒక్క టి20 కూడా నెగ్గలేదన్న చరిత్రను చెరిపేసి... ప్రతిష్టాత్మక ప్రపంచ కప్‌నకు ముందు చివరి విదేశీ పర్యటనను ఘనంగా ముగించాలని యోచిస్తోంది. కొత్త కొత్త ప్రయోగాలతో అన్ని విభాగాల్లో తమను తాము పరీక్షించుకుంటోంది. ప్రత్యర్థి జట్టు ఇటీవల ఫామ్‌లో లేనందున మన జట్టును సిరీస్‌లో ఫేవరెట్‌గా భావించొచ్చు.  

వెల్లింగ్టన్‌: ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌తో ప్రారంభమైన టీమిండియా మూడు నెలల సుదీర్ఘ విదేశీ పర్యటన న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌ ద్వారా ఆఖరి అంకానికి వచ్చింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భాగంగా కివీస్‌తో బుధవారం ఇక్కడ తొలి టి20 జరుగనుంది. భారత్‌లాగే అటు ఆతిథ్య జట్టు కూడా కూర్పుపరంగా భిన్నంగా కనిపిస్తుండటం ఈ సిరీస్‌లో ఓ విశేషం. రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి విశ్రాంతితో సారథ్యంతో పాటు బ్యాటింగ్‌లోనూ రోహిత్‌ శర్మ మెరవాల్సి ఉంటుంది. వెస్టిండీస్, ఆస్ట్రేలియాలపై టి20 సిరీస్‌లకు తప్పించిన వెటరన్‌ మహేంద్ర సింగ్‌ ధోని పొట్టి ఫార్మాట్‌లో పునరాగమనం చేయనున్నాడు. గాయం, సస్పెన్షన్‌తో కొన్నాళ్లుగా అంతర్జాతీయ టి20లు ఆడని ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఈసారి ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరం కానుంది.  

భారత్‌ కూర్పు ఎలా? 
బ్యాటింగ్‌లో రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, బౌలింగ్‌లో పేసర్‌ షమీ ఈ సిరీస్‌కు జట్టులో లేరు. దీంతో టీమిండియా కూర్పు కొంత కొత్తగా కనిపించనుంది. ఓపెనర్లు రోహిత్, ధావన్‌ తర్వాత యువ శుబ్‌మన్‌ గిల్‌ మూడో స్థానంలో వస్తాడు. అంచనాల ప్రకారం చూస్తే జట్టులో రిషభ్‌ పంత్, దినేశ్‌ కార్తీక్, ధోని రూపంలో ముగ్గురు స్పెషలిస్ట్‌ వికెట్‌ కీపర్లూ ఉండే అవకాశం ఉంది. అన్నదమ్ములు కృనాల్‌ పాండ్యా, హార్దిక్‌ పాండ్యా ఆల్‌ రౌండర్ల కోటాను భర్తీ చేయనున్నారు.

ఇద్దరు స్పిన్నర్లు కావాలనుకుంటేనే కృనాల్‌ను దింపుతారు. చహల్‌ రూపంలో ఒక్క స్పిన్నర్‌ సరిపోతాడనుకుంటే కృనాల్‌ స్థానంలో కేదార్‌ జాదవ్‌ను తీసుకోవచ్చు. సిద్ధార్థ్‌ కౌల్, మొహమ్మద్‌ సిరాజ్‌ ఉన్నా భువనేశ్వర్‌కు తోడు రెండో పేసర్‌గా ఖలీల్‌నే ఎంచుకోవచ్చు. ప్రయత్నించి చూద్దామని భావిస్తే కౌల్‌ తుది జట్టులో ఉంటాడు. ఈ అంచనా ప్రకారం చూస్తే బౌలింగ్‌ తేలిపోతోంది. కాబట్టి గిల్, పంత్‌లలో ఒకరిని పక్కనపెట్టి కృనాల్, జాదవ్‌ ఇద్దరినీ బరిలో దింపొచ్చు. రోహిత్, ధావన్‌ రాణింపుపైనే మన జట్టు ప్రదర్శన ఆధారపడి ఉంటుంది. 

గప్టిల్, బౌల్ట్‌ లేకుండానే... 
ఆతిథ్య జట్టు డాషింగ్‌ ఓపెనర్‌ గప్టిల్, ప్రధాన పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ లేకుండానే ఆడనుంది. మున్రోతో పాటు కెప్టెన్‌ విలియమ్సన్‌ ఇన్నింగ్స్‌ ఆరంభిస్తాడు. వన్డేల్లో విఫలమైన విలియమ్సన్‌ రాణించాలని పట్టుదలతో ఉన్నాడు. మిడిలార్డర్‌ భారం మళ్లీ రాస్‌ టేలర్‌దే. నీషమ్, వికెట్‌ కీపర్‌ సీఫ్రెట్‌లతో అతడు బండి నడిపించాల్సి ఉంటుంది. సౌథీ, బ్రాస్‌వెల్‌తో పాటు స్కాట్‌ కుగ్లీన్‌ పేస్‌ బాధ్యతలు పంచుకుంటారు. ఇద్దరు స్పిన్నర్లు సాన్‌ట్నర్, సోథిలను ఆడించేందుకు కివీస్‌ మొగ్గు చూపుతోంది. 

అమ్మాయిలు అదరగొడతారా?
నేడు న్యూజిలాండ్‌తో తొలి టి20
వెల్లింగ్టన్‌: వెటరన్‌ మిథాలీ రాజ్‌ను ఆడించక పోవడంతో పాటు ఓటమి కారణంగా చేదు జ్ఞాపకంగా మిగిలిన టి20 ప్రపంచ కప్‌ సెమీఫైనల్‌ తర్వాత... భారత మహిళల క్రికెట్‌ జట్టు తొలిసారిగా పొట్టి ఫార్మాట్‌ బరిలో దిగుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా డాషింగ్‌ బ్యాటర్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలో న్యూజిలాండ్‌తో బుధవారం ఇక్కడ తొలి టి20 ఆడనుంది. ఇదే వేదికపై మహిళల మ్యాచ్‌ అనంతరం భారత్, న్యూజిలాండ్‌ పురుషుల టి20 మ్యాచ్‌ను నిర్వహిస్తారు.

కివీస్‌తో మ్యాచ్‌లో మిథాలీ రాజ్‌ను ఈసారి ఏ స్థానంలో దింపుతారనేది ఆసక్తికరం కానుంది.  ఈ హైదరాబాదీ వెటరన్‌ బ్యాటర్‌ మిథాలీ రాజ్‌ త్వరలో అంతర్జాతీయ టి20లకు వీడ్కోలు చెప్పనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగనున్న టి20 సిరీస్‌ ఇందుకు వేదిక కానున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు ప్రసుత్త న్యూజిలాండ్‌ సిరీస్‌లో మిథాలీని పూర్తిగా ఆడిస్తే... ఆ వెంటనే ఆమె టి20లకు రిటైర్మెంట్‌ ప్రకటిస్తుందని భావిస్తున్నారు. 

తుది జట్లు (అంచనా) 
భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ధావన్, గిల్, పంత్, దినేశ్‌ కార్తీక్, ధోని, హార్దిక్, కృనాల్‌/జాదవ్, భువనేశ్వర్, ఖలీల్, చహల్‌/కుల్దీప్‌. 
న్యూజిలాండ్‌: విలియమ్సన్‌ (కెప్టెన్‌), మున్రో, సీఫ్రెట్, రాస్‌ టేలర్, నీషమ్, గ్రాండ్‌హోమ్, సాన్‌ట్నర్, స్కాట్‌ కుగ్లీన్, బ్రాస్‌వెల్, ఫెర్గూసన్‌/సౌథీ, సోధి.

పిచ్, వాతావరణం 
స్వింగ్‌కు అనుకూలించినా పైకి కనిపించిన దానికంటే భిన్నంగా ఉండటం వెస్ట్‌పాక్‌ మైదానంలోని పిచ్‌ స్వభావం. మంచు ప్రభావం ఉంటుంది. ఇంగ్లండ్‌తో చివరిసారిగా ఇక్కడ జరిగిన టి20లో కివీస్‌ 196 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునేందుకు శ్రమించింది. ఇంగ్లండ్‌ పోరాటంతో 184 పరుగులు చేసింది. 

►0 న్యూజిలాండ్‌లో టీమిండియా ఇంతవరకు ఒక్క టి20 కూడా గెలవలేదు. 2009 పర్యటనలో 0–2తో పరాజయం పాలైంది. 

►2 గత ఏడు టి20 సిరీస్‌లలో కివీస్‌ రెండే గెలిచింది. 

►1 రోహిత్‌ శర్మ 12 టి20ల్లో భారత్‌కు సారథ్యం వహించగా... ఒక్కదాంట్లో జట్టు ఓడింది.  

►10 ఆడిన గత పది టి20 సిరీస్‌లలో టీమిండియా అన్నింటిని గెలిచింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement