పుణే: భారత జట్టుకు తొలి టి20 ప్రపంచకప్‌ను అందించిన మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ టి20 కెరీర్ ముగిసినట్లేనా! వెస్టిండీస్, ఆస్ట్రేలియాలతో జరిగే టి20 సిరీస్‌ల కోసం ప్రకటించిన జట్లలో ధోనికి చోటు ఇవ్వకుండా సెలక్టర్లు పరోక్షంగా తమ ఉద్దేశాన్ని చెప్పేశారా. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శుక్రవారం రాత్రి ఆలస్యంగా నాలుగు వేర్వేరు జట్లను ప్రకటించింది. వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే టి20 సిరీస్‌తో పాటు ఆస్ట్రేలియాతో జరిగే ప్రతిష్టాత్మక నాలుగు టెస్టుల సిరీస్, టి20 సిరీస్‌లకు జట్లను ఎంపిక చేసింది.
దీనికి తోడు టెస్టు జట్టులోని ప్రధాన ఆటగాళ్లతో కూడిన ‘ఎ’ టీమ్‌ను న్యూజిలాండ్ ‘ఎ’తో జరిగే తొలి అనధికారిక టెస్టు కోసం వెల్లడించారు. ఇంగ్లండ్ సిరీస్ మధ్యలో చోటు కోల్పోయిన మురళీ విజయ్, అంతకుముందే స్థానం లేని రోహిత్ శర్మ, వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ ఎంపిక ఆసీస్‌తో సిరీస్‌కు అనూహ్య నిర్ణయాలు. వరుసగా రెండు టి20 సిరీస్‌లకు ధోనిని పక్కన పెట్టడం అంటే విశ్రాంతిగా భావించలేం కాబట్టి అతను ఇక వన్డేలకే పరిమితమైనట్లని చెప్పవచ్చు. ఆయా జట్లలో ఉన్న రెగ్యులర్ ఆటగాళ్లను మినహాయించి శుక్రవారం ఎంపికలో చోటు చేసుకున్న కీలక మార్పులను చూస్తే...
కోహ్లికి మళ్లీ విశ్రాంతి...
వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే మూడు టి20ల సిరీస్‌కు విరాట్ కోహ్లి దూరమయ్యాడు. అతని స్థానంలో రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఉన్న ఆటగాళ్లు మినహా కొత్తగా అవకాశం దక్కినవారిని చూస్తే... విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతంగా ఆడిన జార్ఖండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ తొలిసారి జట్టులోకి ఎంపికయ్యాడు. గతంలో టీమ్‌లోకి ఎంపికైనా మ్యాచ్ దక్కని కృనాల్ పాండ్యాకు మరో చాన్స్ లభించింది. భారత్ తరఫున చెరో 6 టి20లు ఆడిన శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్‌లను కూడా తీసుకున్నారు. వన్డేల్లో స్థానం కోల్పోయిన దినేశ్ కార్తీక్‌ను కూడా ఎంపిక చేయడం మరో ఆశ్చర్యకర నిర్ణయం. మరోవైపు ఫిట్‌నెస్ సమస్యలతో గురువారం ఎంపిక చేయలేదని ప్రకటించిన కేదార్ జాదవ్‌ను నాలుగు, ఐదు వన్డేల కోసం టీమ్‌లోకి తీసుకోవడం విశేషం.
ఆసీస్‌తో టి20లకు రెడీ...
విండీస్ సిరీస్ అనంతరం కోహ్లి మళ్లీ భారత జట్టుతో చేరతాడు. ఆస్ట్రేలియాతో నవంబర్ 21నుంచి ప్రారంభమయ్యే టి20 సిరీస్‌కు అతను నాయకత్వం వహిస్తాడు. విండీస్‌తో సిరీస్‌కు ఎంపికైన షాబాజ్ నదీమ్‌కు ఇందులో చోటు దక్కలేదు. ఇది మినహా మరే మార్పు లేదు.
విహారికి చోటు...
ప్రతిష్టాత్మక బోర్డర్–గావస్కర్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన జట్టులో సెలక్షన్ కమిటీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇంగ్లండ్‌లో రెండు టెస్టుల్లో ఘోర వైఫల్యం తర్వాత స్థానం కోల్పోయిన ఓపెనర్ మురళీ విజయ్‌ను మళ్లీ ఎంపిక చేసింది. చోటు కోల్పోయిన తర్వాత విజయ్ కౌంటీల్లో ఎసెక్స్ తరఫున ఆడిన 5 ఇన్నింగ్స్‌లలో 1 సెంచరీ, 3 అర్ధ సెంచరీలు చేశాడు. ఆ తర్వాత విజయ్ హజారే టోర్నీలో 3, 44, 24 పరుగులు సాధించాడు. అయితే సొంతగడ్డపై విండీస్‌తో టెస్టులకు ఎంపిక కాని శిఖర్ ధావన్‌పై మాత్రం సెలక్టర్లు నమ్మకం ఉంచలేదు.
దాంతో అతనికి అవకాశం దక్కలేదు. టెస్టుల్లో రోహిత్ శర్మ పునరాగమనం మాత్రం పూర్తిగా అతని వన్డే, టి20 ఫామ్‌ను చూసే జరిగిందని చెప్పవచ్చు. దక్షిణాఫ్రికా గడ్డపై రెండు టెస్టుల్లో 10, 47, 11, 10 పరుగులు చేసిన తర్వాత మూడో టెస్టుకు దూరమై ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఎంపిక కాని రోహిత్ ఆ తర్వాత ఎలాంటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడలేదు. ఆసియా కప్‌లో జట్టును గెలిపించిన అనంతరం విజయ్ హజారేలో రెండు వన్డేలు, విండీస్‌తో మరో రెండు వన్డేలు ఆడాడు. పంత్ ప్రధాన కీపర్‌గా ఎదగగా... సాహా గాయం నుంచి కోలుకోకపోవడంతో సెలక్టర్లు మళ్లీ వెటరన్ పార్థివ్ పటేల్‌కే తమ ఓటు వేశారు.
దక్షిణాఫ్రికా సిరీస్‌లో రెండు టెస్టులు ఆడిన అనంతరం అతను ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఎంపిక కాలేదు. ఇప్పుడు మరోసారి ఆ అవకాశం వచ్చింది. 2003–04 సిరీస్‌లోనే ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన పార్థివ్ ఇప్పుడు జట్టులో అక్కడి అనుభవంరీత్యా అందరికంటే సీనియర్ కానున్నాడు! విండీస్‌తో సిరీస్‌లో జట్టులో ఉన్నా మ్యాచ్ దక్కని ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారికి కూడా ఆస్ట్రేలియా వెళ్లే అవకాశం లభించింది. ఐదుగురు ప్రధాన పేసర్లు భువనేశ్వర్, బుమ్రా, ఇషాంత్, షమీ, ఉమేశ్ యాదవ్‌లకే కట్టుబడిన సెలక్టర్లు అశ్విన్, జడేజాలతో పాటు మూడో స్పిన్నర్‌గా కుల్దీప్‌ను కూడా ఎంపిక చేయడం విశేషం.
ప్రాక్టీస్ కోసం ముందుగా...
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ ‘ఎ’తో జరిగే తొలి నాలుగు రోజుల మ్యాచ్ కోసం భారత్ ‘ఎ’ జట్టును కూడా సెలక్టర్లు ప్రకటించారు. అయితే మ్యాచ్ ప్రాక్టీస్ కోసం టెస్టు జట్టులో భాగంగా ఉన్న పలువురు ఆటగాళ్లను ఇందులోకి ఎంపిక చేశారు. రహానే కెప్టెన్సీలో విజయ్, పృథ్వీ షా, విహారి, రోహిత్, పార్థివ్ ఈ మ్యాచ్ ఆడనున్నారు. టెస్టుల్లో స్థానం ఆశించిన మయాంక్ అగర్వాల్‌కు ఇక్కడ మాత్రం చోటు లభించింది. హైదరాబాద్ పేసర్ సిరాజ్, ఆంధ్ర ఆటగాడు కేఎస్ భరత్ కూడా ఈ జట్టులో ఉన్నారు.
భారత్ జట్టు 2006 నుంచి ఇప్పటి వరకు 104 టి20 మ్యాచ్‌లు ఆడితే 93 మ్యాచ్‌లలో ధోని భాగంగా ఉన్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో ధోనికి ఒకే మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది.
విండీస్‌తో, ఆస్ట్రేలియాతో జరిగే టి20ల్లో ధోని ఆడబోవడం లేదు. మేం రెండో వికెట్ కీపర్‌ను పరీక్షించే ప్రయత్నంలో ఉన్నాం. ఈ విషయంలో పంత్, కార్తీక్ పోటీ పడతారు. అయితే టి20ల్లో ధోని కెరీర్ ముగిసిందని మాత్రం చెప్పలేను.
–ఎమ్మెస్కే ప్రసాద్, చీఫ్ సెలక్టర్
ఆసీస్‌తో టెస్టులకు జట్టు: కోహ్లి (కెప్టెన్), విజయ్, రాహుల్, పృథ్వీ షా, పుజారా, రహానే, విహారి, రోహిత్, పంత్, పార్థివ్, అశ్విన్, జడేజా, కుల్దీప్, షమీ, ఇషాంత్, ఉమేశ్, బుమ్రా, భువనేశ్వర్.
న్యూజిలాండ్ ‘ఎ’తో మ్యాచ్‌కు భారత్ ‘ఎ’ జట్టు: రహానే (కెప్టెన్), విజయ్, పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, విహారి, రోహిత్, పార్థివ్, కృష్ణప్ప గౌతమ్, షాబాజ్ నదీమ్, సిరాజ్, నవదీప్ సైనీ, దీపక్ చహర్, రజనీశ్ గుర్బానీ, విజయ్ శంకర్, కేఎస్ భరత్.
వెస్టిండీస్‌తో టి20లకు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ధావన్, రాహుల్, దినేశ్ కార్తీక్, మనీశ్ పాండే, శ్రేయస్, పంత్, కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, చహల్, కుల్దీప్, భువనేశ్వర్, బుమ్రా, ఖలీల్ అహ్మద్, ఉమేశ్, షాబాజ్ నదీమ్.
(నదీమ్ మినహా మిగతా జట్టును ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌కు ఎంపిక చేశారు. విశ్రాంతి అనంతరం విరాట్ కోహ్లి మళ్లీ కెప్టెన్సీ చేపడతాడు)
రోహిత్ శర్మ, విజయ్
Comments
Please login to add a commentAdd a comment