'వైన్' వన్నె తగ్గుతోందా!
ధోని అనూహ్య వైఫల్యం ఒక్కో పరుగు కోసం శ్రమించిన బ్యాట్స్‌మన్ కెరీర్‌లో చేదు జ్ఞాపకంలాంటి ఇన్నింగ్స్
ధోనిని అంతగా అలా నిరాశా నిస్పృహలతో చూసి ఎన్నేళ్లయింది? ఎన్ని కీలక మ్యాచ్‌లు ఓడినా ముఖంలో ఎలాంటి భావాలు కనపడనీయకుండా స్థితప్రజ్ఞత కనబర్చే అతను ఒక్క వన్డే ఓటమికి ఇంతగా బాధ పడతాడా? నాలుగో వన్డే ముగిశాక ధోనిని చూస్తే ఇలాగే అనిపించింది. అవుటై వచ్చిన తర్వాత ప్యాడ్లు కూడా విప్పకుండా చివరి ఓవర్లో భారత్ పరాజయాన్ని చూస్తూ ఉండిపోవాల్సి రావడం అతను తన తప్పుగానే భావించి ఉంటాడా? అది తాను గెలిపించాల్సిన మ్యాచ్. కానీ తన వల్ల కాకపోవడం ఓటమికంటే ధోనిని ఎక్కువగా బాధించినట్లుంది. సహచరుడు కదిలిస్తే గానీ ఈ లోకంలోకి రాలేనంత పరధ్యానంలో అతను కనిపించాడు.
103 బంతులు ఆడితే గానీ ఒక ఫోర్ కొట్టలేని,108 బంతులకు గానీ అర్ధ సెంచరీ చేయలేని ధోనిని ఎప్పుడైనా చూశామా? రెండో మ్యాచ్ ఆడుతున్న అనామకుడు కెస్‌రిక్ విలియమ్స్ 22 బంతుల్లో ధోనిని సింగిల్ కూడా తీయకుండా ఆపడమేంటి? పేరు లేని ఇద్దరు స్పిన్నర్లు కలిపి వేసిన 68 బంతుల్లో ధోని 28 పరుగులు మాత్రమే చేయడమేంటి? దూకుడుకు మారుపేరైన ధోని స్వీప్ షాట్‌తో పరుగులు రాబట్టాలని ప్రయత్నించడం మీకు ఎప్పుడైనా గుర్తుందా? వయసుతో పాటు వన్నె పెరిగే వైన్‌లాంటివాడినని చెప్పుకున్న ధోని ఆట అనూహ్యం. మూత తీసిన వైన్‌లా అతనూ ‘ఎక్స్‌పైరీ డేట్’కు చేరువయ్యాడా అనే సందేహాలు ఈ ఇన్నింగ్స్ రేకెత్తించింది.
సాక్షి క్రీడా విభాగం
కాన్పూర్‌లో దక్షిణాఫ్రికాతో, లాడర్‌హిల్‌లో వెస్టిండీస్‌తో, హరారేలో జింబాబ్వేతో, తాజాగా నార్త్ స్టాండ్‌లో విండీస్‌తో... ధోని దాదాపు చివరి వరకు క్రీజ్‌లో ఉండి అతనిపై నమ్మకం ఉంచుకున్న సమయంలో గెలిపించలేక విఫలమైన ఇటీవలి మ్యాచ్‌లు ఇవి. మ్యాచ్‌ను ఫినిష్ చేయాలంటే ధోనినే అనిపించే స్థితి నుంచి ఇప్పుడు తడబడుతున్న తీరు... మారిన అతని ఆటకు అద్దం పడుతోంది. గతంలో ఇదే వెస్టిండీస్ గడ్డపై శ్రీలంతో చివరి ఓవర్లో విజయానికి 15 పరుగులు కావాల్సి ఉండగా మూడే షాట్లు 6, 4, 6తో అతను ముగించాడు. తీవ్ర ఒత్తిడితో ఉండే చివరి ఓవర్లలో మరో బ్యాట్స్‌మన్‌ను కూడా నమ్మకుండా తనపైనే నమ్మకముంచడం అతని ఆత్మవిశ్వాసానికి సంకేతంగా కనిపించేది. దాదాపు మూడేళ్ల క్రితం ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అంబటి రాయుడుకు స్ట్రైకింగ్ నిరాకరించిన ఘటన దీనికి చక్కటి ఉదాహరణ. పై మ్యాచ్‌లను చూస్తే ఆఖరి ఓవర్లో దక్షిణాఫ్రికాపై 11 పరుగులు (బౌలర్ రబడ), జింబాబ్వేపై 8 పరుగులు (మద్‌జివా), విండీస్‌పై 8 పరుగులు (డ్వేన్ బ్రేవో) చేయడంలో ధోని విఫలమయ్యాడు.
వేగానికి కళ్లెం...
ఆదివారం మ్యాచ్ తర్వాత ధోని ఆటను అంచనా వేసేందుకు ప్రత్యేకమైన కారణం ఉంది. గెలిపించలేకపోయిన గత మ్యాచ్‌లలో ధోని చివర్లోనే బ్యాటింగ్‌కు వచ్చి ధనాధన్‌గా ముగించాల్సిన పరిస్థితిలో ఆడాడు. కానీ నాలుగో వన్డేలో అతను 13వ ఓవర్లోనే బ్యాటింగ్‌కు వచ్చాడు. చాలా సేపు క్రీజ్‌లో గడిపిన తర్వాత కూడా పరిస్థితిని బట్టి ఆడలేకపోవడం అతని వైఫల్యాన్ని చూపిస్తోంది. ఈ విషయంలో పిచ్‌ను కూడా తప్పు పట్టలేం. గత మ్యాచ్‌లో ఇంతకంటే కఠినమైన వికెట్‌పై ధోని 78 పరుగులు సాధించాడు. ఆ మ్యాచ్‌లో అతను ఎంతో స్వేచ్ఛగా ఆడాడు. ధోని అనుభవాన్ని బట్టి చూస్తే 49వ ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసి స్ట్రైకింగ్ కాపాడుకుంటారని అంతా భావించారు.
కానీ పేలవ షాట్‌కు ప్రయత్నించి అతను వెనుదిరిగడంతో చివరి ఓవర్లో చేసేందుకు ఏమీ లేకపోయింది. తక్కువ వ్యవధిలో కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా అవుటైన తర్వాత కూడా ధోని బ్యాటింగ్‌లో దూకుడు పెంచలేకపోయాడు. స్వల్ప ఛేదనలో జట్టులోని ఇతర ఆటగాళ్లు కూడా విఫలమైనప్పుడు ధోనినే తప్పు పట్టడం సరైంది కాదనిపిస్తుంది. కానీ ఇలాంటి మ్యాచ్‌ల విజయాలతోనే తన పేరు అల్లుకుపోయి ఉందని... ఇది తాను కచ్చితంగా ఫినిష్ చేయాల్సిన మ్యాచ్ అని ధోనికి కూడా తెలుసు. అదే బాధ అతనిలో మ్యాచ్ తర్వాత కనిపించింది. చివరి వరకు ఉంటే చాలు నేను గెలిపించగలననేది ధోని తరచుగా చెప్పే మాట. కానీ ఈ మ్యాచ్‌లో ఆ నమ్మకం పని చేయలేదు.
మున్ముందు ఎలా...
ధోని బ్యాటింగ్‌లో లోపమేమీ లేదంటూ మ్యాచ్ ముగిశాక బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ మాజీ కెప్టెన్‌కు మద్దతు పలికారు. అయితే ఇప్పటికే ద్రవిడ్ స్థాయి వ్యక్తి ధోని, యువరాజ్ సింగ్‌ల పాత్రపై సందేహాలు వ్యక్తం చేయడంతో తాజా ప్రదర్శన కూడా చర్చకు కారణం కావడం ఖాయం. యువ ఆటగాడు రిషభ్ పంత్‌ను ఆడించాలని కూడా అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ధోని ఫిట్‌నెస్ విషయంలో ఇప్పటికీ ఎవరికీ సందేహాలు లేకున్నా... అతను గతంలోలాగా బ్యాట్స్‌మన్‌గా కీలక పాత్ర పోషించలేకపోతున్నాడనేది వాస్తవం. ఈ విషయం కెప్టెన్ కోహ్లికి కూడా బాగా తెలుసు. 2019 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని జట్టును తీర్చిదిద్దుతున్నామని బీసీసీఐ గానీ, సెలక్టర్లు గానీ పదే పదే చెబుతున్నారు.
వచ్చే రెండేళ్ల పాటు తనదైన టీమ్‌ను సిద్ధం చేసుకోవాలని కోహ్లి భావించడం సహజం. ఇప్పుడు అన్నింటా అతని హవా సాగుతోంది. తాజా ఫామ్ ప్రకారం అతని జట్టులో ధోని, యువీలకు చోటు దక్కడం అంత సులువు కాదు! ఈ మ్యాచ్ ప్రదర్శన ధోని భవిష్యత్తును నిర్దేశించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మ్యాచ్ తర్వాత ధోనిని చూస్తే అతను కూడా స్వయంగా ఆ దిశగా ఆలోచించే ఉంటాడని అనిపిస్తుంది. టెస్టుల నుంచి రిటైర్మెంట్, వన్డే కెప్టెన్సీ వదులుకోవడంలాగే మళ్లీ అతను ఏదైనా అనూహ్య నిర్ణయం తీసుకుంటాడా చూడాలి!