రెండో వన్డేలో భారత్కు షాకిచ్చిన విండీస్
విశాఖ: వరుస విజయాలతో సూపర్ ఫాంలో ఉన్న భారత్కు వెస్టిండీస్ షాకిచ్చింది. ఈ రోజు విశాఖలో జరిగిన రెండో వన్డేలో భారత్ 2 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. భారత్ విసిరిన 289 పరుగుల విజయలక్ష్యాన్నిఛేదించిన విండీస్ టోర్నీలో శుభారంభం చేసింది. గత వన్డేలో పేలవమైన ఆట తీరును కనబరిచన విండీస్ ఆటగాళ్లు ఈ మ్యాచ్ లో మెరిశారు. విండీస్ ఆటగాళ్లో పావెల్ (59), డారెన్ (50) పరుగులు చేసి విండీస్కు చక్కటి పునాది వేశారు. అనంతరం సిమ్మన్స్ (62), సామీ (63) పరుగులు చేసి విండీస్ విజయంలో తమ తోడ్పాటునందించారు. భారత్ బౌలర్లో భువనేశ్వర్ కుమార్, అశ్విన్, మహ్మద్ సమీలకు తలో రెండు వికెట్లు లభించాయి. ముందు టాస్ గెలిచిన విండీస్ భారత్ ను బ్యాటింగ్కు ఆహ్వానించింది.
భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. విండీస్ ముందు 289 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. కోహ్లీ 99, రోహిత్ శర్మ 12, ధావన్ 35, యువరాజ్ సింగ్ 28, రైనా 23, జడేజా 10, అశ్విన్ 19 పరుగులు చేసి అవుటయ్యారు. చివర్లో ధోనీ మెరుపులు మెరిపించాడు. ధోనీ కేవలం 39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగుల చేసి నాటౌట్ గా నిలిచాడు.