సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌ను టీమిండియా ఇప్పటికే 2-0తో కోల్పోగా, కోహ్లీ సేనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కీలక ఆటగాడు రోహిత్ శర్మతో పాటు మురళీ విజయ్, రాహుల్‌ల ఆటతీరును మాజీ క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, కామెంటెటర్ డీన్ జోన్స్ హార్డ్ హిట్టర్ రోహిత్ శర్మకు కొన్ని విలువైన సూచనలు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో 2017లో రోహిత్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని నిలకడగల ఆటగాడు అజింక్య రహానేను పక్కనపెట్టారు. అయితే అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన రోహిత్ నైపుణ్యం ఉన్న ఆటగాడే కానీ, డిఫెన్స్ బ్యాటింగ్ చేయకపోవడం వల్లే విఫలమవుతున్నాడని జోన్స్ అభిప్రాయపడ్డాడు.
టెస్టు క్రికెట్‌లో డిఫెన్స్ ఆటతీరు (రక్షణాత్మక ధోరణి) 70 శాతం ఉంటుందని, అదే వన్డేల విషయానికొస్తే 40 శాతం ఉంటుందన్నాడు. వన్డేల్లో డిఫెన్స్ ఆడే ఛాన్స్ తక్కువగా ఉంటుంది కనుక, రోహిత్ నిర్దాక్షిణ్యంగా బౌలర్లపై విరుచుకుపడి పరుగులు సాధించేవాడు. కానీ టెస్టుల్లో నిలదొక్కుకోవాలన్నా, నిలకడగా పరుగులు చేయాలన్నా దిగ్గజ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్ ల తరహాలో డిఫెన్స్ నైపుణ్యాన్ని అలవరుచుకోవాలని రోహిత్ శర్మకు జోన్స్ సూచించాడు. టెస్టుల్లో మొదట రాణించలేడని పేరున్న విరాట్ కోహ్లీ డిఫెన్స్ ఆటతీరుతో శతకాల మీద శతకాలు చేశాడని గుర్తుచేశాడు.
కేప్‌టౌన్, సెంచూరియన్ టెస్టుల్లో మొత్తం నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి రోహిత్ కేవలం 19.50 సగటుతో 78 పరుగులు చేసి దారుణంగా విఫలమయ్యాడు. కోహ్లీ, రోహిత్‌పై నమ్మకం ఉంచి రెండో టెస్టులోని ఛాన్స్ ఇచ్చాడు. కానీ వాస్తవానికి రోహిత్ విఫలమైన భయంకరమైన సిరీస్ అని అభిప్రాయపడ్డాడు. టెక్నిక్ మెరుగు పరుచుకున్న రోహిత్.. షాట్ల ఎంపికతో పాటు డిఫెన్స్ ఆటతీరుతోనే జట్టుకు విజయాలు అందించగలడని ఆసీస్ మాజీ క్రికెటర్ విలువైన సూచనలిచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment