ఒంగోలు టౌన్ : దేశంలో వంద కోట్లకు పైగా జనాభా ఉన్నా పూర్తి స్థాయిలో ఒలింపిక్స్ ఆటల్లో రాణించేవారు అతి తక్కువ మందే. అదే సమయంలో అథ్లెట్స్‌కు కొదువే లేదు. కానీ ఇలాంటి వారి ప్రతిభ గ్రామాలు, పట్టణాలు దాటి బయటకు రావడంలేదు. వారు అక్కడికే పరిమితం అవుతున్నారు. దీంతో ఇలాంటి క్రీడాకారులను గుర్తించి వారిలోని ప్రతిభకు మరింత పదును పెట్టి ఒలింపిక్స్‌లో పతకాలు సాధించేవారిగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ సంసిద్ధం అయింది. ప్రాజెక్టు గాండీవ పేరుతో పాఠశాలల స్థాయిలోనే క్రీడా ప్రతిభాన్వేషణకు శ్రీకారం చుట్టింది. ఒలింపిక్స్‌లో పథకాలు సాధించడమే లక్ష్యంగా నిర్వహించనున్న ఆపరేషన్ గాండీవను రాష్ట్రంలోని 13 జిల్లాల్లో నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా క్షేత్ర స్థాయిలో అథ్లెటిక్స్‌ను గుర్తించి వారికి అంతర్జాతీయ శిక్షకుల వద్ద తర్ఫీదు పొందిన పీఈటీలతో ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారిని వివిధ రకాల క్రీడాంశాల్లో రాటుదేలేలా చేయడం ప్రాజెక్టు గాండీవ ముఖ్యోద్దేశం. ప్రాజెక్టు గాండీవ కింద ఎంపికైన విద్యార్థులకు బలవర్థకరమైన ఆహారాన్ని అందిస్తూ, ప్రత్యేక శిక్షణకు అవసరమైన క్రీడా పరికరాలను అందుబాటులో ఉంచనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 303 పాఠశాలలు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ ప్రాజెక్టు గాండీవ అమలుకోసం రాష్ట్రంలో 303 పాఠశాలలను ఇటీవల గుర్తించారు. ఇందులో కనీస క్రీడా వసతులైన 200 మీటర్ల ట్రాక్, ఇతర ఆటల మైదానాలు కలిగిన 100 విద్యాలయాలను గుర్తించి వాటిని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కి అనుసంధానం చేయనుంది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 10 సంవత్సరాలు పైబడిన బాల బాలికలకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి ప్రతిభావంతులైన 70 నుంచి 90 మంది వరకు క్రీడాకారులను గుర్తిస్తారు. వారిని జిల్లా కేంద్రంలో జరిగే ప్రతిభ అన్వేషణ కార్యక్రమంలో పాల్గొనేందుకుగాను అన్ని పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించి పంపించాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీచేసింది.
జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలో..
ప్రాజెక్టు గాండీవకు సంబంధించిన క్రీడా ప్రతిభాన్వేషణకు జిల్లా స్థాయిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ ఏర్పాటు చేసిన కమిటీ ఎంపిక ప్రక్రియ నిర్వహించనుంది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో క్షేత్ర స్థాయిలో క్రీడాకారులను గుర్తించిన అనంతరం జిల్లా స్థాయి కమిటీ వారిలోని ప్రతిభను గుర్తించి 90 మంది వరకు ఎంపిక చేయనుంది. వారికి జిల్లాలో గుర్తించిన పాఠశాలల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. జూన్ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించినప్పటికీ, రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వరుసగా ఐదురోజులపాటు పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దానికితోడు పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకునేందుకు బడి పిలుస్తోంది కార్యక్రమంలో సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు నిమగ్నమై ఉన్నారు. మరో రెండు రోజులపాటు బడి పిలుస్తోంది కార్యక్రమం జరగనుంది. ఆ తర్వాత పాఠశాలలు పూర్తి స్థాయిలో యథావిధిగా నడవనున్నాయి.
విస్తృతంగా ప్రచారం
ప్రాజెక్టు గాండీవకు సంబంధించి విద్యార్థుల్లోని క్రీడా ప్రతిభాన్వేషణకు విస్తృతంగా ప్రచారం చేయాలని ఆం«ధ్రప్రదేశ్ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకం గురించి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు అవగాహన కలిగిచేందుకు అన్ని పాఠశాలల్లో ఉదయం పూట నిర్వహించే అసెంబ్లీలో సంబంధిత ప్రధానోపాధ్యాయుడు లేదా ఫిజికల్ లిట్రసీ టీచర్ లేదా టీచర్‌లతో ప్రకటన చేయించాలని సూచించింది. తద్వారా ఆసక్తి కలిగిన విద్యార్థులు తమలో దాగి ఉన్న క్రీడను వెలికి తీసుకువచ్చేందుకు, దానికి పదును పెట్టేందుకు దోహదపడుతోందని భావించింది. అయితే ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమైన తరువాత తరగతుల నిర్వహణ అంతంత మాత్రంగానే జరుగుతోంది.
ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వరుసగా ఐదురోజులపాటు పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సోమవారం నుండి పాఠశాలలు యథావిధిగా కొనసాగనుండటంతో ప్రాజెక్టు గాండీవకు సంబంధించి విస్తృతంగా ప్రచారం చేయాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment