మొహాలీ: చాంపియన్స్ లీగ్ టి20 క్వాలిఫయింగ్ మ్యాచుల్లో ఒటాగో వోల్ట్స్ జట్టు అగ్రస్థానంలో నిలిచింది. సన్‌రైజర్స్ జోరుకు పగ్గాలు వేస్తూ శుక్రవారం ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్‌లో ఒటాగో వోల్ట్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ రెండు జట్లు ఇప్పటికే ప్రధాన మ్యాచ్‌లకు అర్హత సాధించడంతో ఎలాంటి ప్రాధాన్యత లేని ఈ మ్యాచ్‌లో రైజర్స్ విఫలమైంది.
ఈ గెలుపుతో క్వాలిఫయింగ్‌లో వోల్ట్స్ ఆడిన మూడు మ్యాచుల్లోనూ నెగ్గినట్లయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 143 పరుగులు చేయగా, ఒటాగో 16.2 ఓవర్లలో 5 వికెట్లకు 144 పరుగులు చేసి విజయాన్నందుకుంది.
ఫామ్‌లో ఉన్న కెప్టెన్ ధావన్ (10 బంతుల్లో 12; 1 సిక్స్)తో పాటు పార్థివ్ (12 బంతుల్లో 12; 2 ఫోర్లు), సమంత్రే (8) వెంట వెంటనే వెనుదిరగడంతో రైజర్స్ 45 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో జేపీ డుమిని (38 బంతుల్లో 57 నాటౌట్; 7 ఫోర్లు), వైట్ (23 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్) సహకారంతో ఇన్నింగ్స్ నిలబెట్టాడు. ఆ తర్వాత స్యామీ (22 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కూడా ఫర్వాలేదనిపించడంతో హైదరాబాద్ స్కోరు 143 పరుగులకు చేరింది. అనంతరం బ్రెండన్ మెకల్లమ్ (39 బంతుల్లో 67 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఒంటి చేత్తో వోల్ట్స్‌ను గెలిపించాడు. రూథర్ ఫోర్డ్ (23 బంతుల్లో 27; 5 ఫోర్లు), నీషమ్ (13 బంతుల్లో 21; 1 ఫోర్, 2 సిక్స్‌లు) అతనికి సహకరించడంతో మరో 22 బంతులు మిగిలి ఉండగానే విజయం వోల్ట్స్ సొంతమైంది.
క్వాలిఫయర్ ‘టాప్’ ఒటాగో
Published Sat, Sep 21 2013 1:17 AM | Last Updated on Fri, Sep 1 2017 10:53 PM
Advertisement