తొలి టెస్టులో పాకిస్థాన్ విజయం
అబుదాబి: టెస్టుల్లో వరల్డ్ నంబర్‌వన్ జట్టుగా కొనసాగుతున్న దక్షిణాఫ్రికాకు పాకిస్థాన్ షాక్ ఇచ్చింది. ఇటీవలే వరల్డ్ నెంబర్ 9 జింబాబ్వే చేతిలో ఓడి విమర్శలపాలైన పాక్... అగ్రశ్రేణి జట్టుపై స్ఫూర్తిదాయక విజయం సాధిం చింది. నాలుగో రోజే ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్ ఏడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడిం చింది. 40 పరుగుల విజయలక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పో యి పాక్ అందుకుంది. డిసెంబర్ 2011లో (డర్బన్) శ్రీలంక చేతిలో పరాజయం తర్వాత 15 టెస్టుల పాటు ఓటమి ఎరుగని దక్షిణాఫ్రికా జోరుకు తాజా ఫలితం తో బ్రేక్ పడింది. యూఏఈ దేశాన్ని సొంత మైదానం గా మార్చుకున్న పాక్ ఇక్కడ నం.1 జట్టుపై వరుసగా నాలుగో విజయాన్ని సాధించడం విశేషం. 2011-12లో అప్పటి టాప్ టీమ్ ఇంగ్లండ్‌పై పాక్ 3-0 తేడాతో విజయాన్ని అందుకుంది.
కట్టడి చేసిన అజ్మల్...
72/4 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం నాలుగో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌లో 232 పరుగులకు ఆలౌటైంది. ఏబీ డివిలియర్స్ (157 బంతుల్లో 90; 7 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ అవకాశం కోల్పోగా, రాబిన్ పీటర్సన్ (67 బంతుల్లో 47 నాటౌట్; 3 ఫోర్లు) కొద్ది సేపు పోరాడాడు. డుమిని (0), డుప్లెసిస్ (9) విఫలమయ్యారు. సయీద్ అజ్మల్ (4/74) చక్కటి బౌలింగ్‌తో దక్షిణాఫ్రికాను కట్టడి చేయగా, జునైద్ ఖాన్ (3/57) కీలక వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 193 పరుగులను మినహాయించి 40 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా పాక్ తడబడింది. 7 పరుగులకే జట్టు ఖుర్రమ్ (4), మసూద్ (0), అజహర్ అలీ (3) వికెట్లు కోల్పోయింది. అయితే ఈ దశలో కెప్టెన్ మిస్బా (26 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడి మ్యాచ్‌ను ముగించాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ఖుర్రమ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఈ నెల 23 నుంచి దుబాయ్‌లో రెండో టెస్టు జరుగుతుంది.