పాకిస్తాన్ జట్టు విజయానందం
కరాచీ : అనుకున్నట్లే జరిగింది. టీ20లో అద్భుతాలకు మారుపేరైన వెస్టిండీస్ క్రికెట్ జట్టు పాకిస్తాన్ వేదిక జరిగిన సిరీస్‌లో ఎలాంటి మ్యాజిక్‌లు చేయలేదు. ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగిన విండీస్ ఓటమితోనే సిరీస్‌ను ముగించింది. విండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను పాకిస్తాన్ క్లీన్‌స్వీప్ చేసింది. మంగళవారం జరిగిన మూడో టీ20లో 8 వికెట్ల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. ఇదివరకే రెండు టీ20లను పాక్ గెలిచిన విషయం తెలిసిందే. పాక్ బ్యాట్స్‌మెన్ ఫఖర్ జామన్‌కు ‘ప్లెయర్ ఆఫ్ ది మ్యాచ్’, బాబర్ అజామ్‌కు ‘ప్లెయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు లభించాయి.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేపట్టిన విండీస్.. బ్యాట్స్‌మెన్ ప్లెచర్(52; 43బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు), శ్యాముల్స్(31; 25బంతుల్లో 2ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. చివర్లో రామ్‌దిన్ (42; 18బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు) మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగుల చేసింది. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ రెండు వికెట్లు తీయగా నవాజ్, ఉస్మాన్ ఖాన్, అష్రాష్ తలో వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన పాక్ 16.5 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి 154 పరుగుల లక్ష్యాన్ని చేరుకుంది. పాక్ ఓపెనర్లు ఫఖర్ జామన్ (40; 17బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు), బాబర్ అజామ్(51; 40బంతుల్లో 6ఫోర్లు) శుభారంభం ఇవ్వగా, హుస్సేన్(31నాటౌట్; 28బంతుల్లో 3ఫోర్లు), ఆసిఫ్ (25 నాటౌట్; 16బంతుల్లో 2ఫోర్లు, 1సిక్సర్) రాణించారు. స్వదేశంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు లేక నిరాశ చెందిన పాక్ అభిమానులకు ఈ సిరీస్‌తో భవిష్యత్తు సిరీస్‌లపై ఆశలు చిగురించాయి.
Comments
Please login to add a commentAdd a comment