నేను... నా స్ఫూర్తి!
పాక్ మహిళా క్రికెటర్ కైనత్ ఆనందం
డెర్బీ: క్రికెట్ మైదానంలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఎంత వైరం ఉన్నా ఒక్కసారి ఆట ముగిశాక వారి మధ్య మంచి స్నేహ సంబంధాలే ఉంటాయి. పురుషుల క్రికెట్‌లో ఇది చాలాసార్లు కనిపించింది. మహిళల క్రికెట్‌లో కూడా ఇదే క్రీడా స్ఫూర్తి ఉందనేదానికి తాజా ఉదాహరణ ఇది. ఇరు జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ పేసర్ కైనత్ ఇంతియాజ్, భారత ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామిని కలిసింది. ఆమెతో ఫొటో దిగి తన పాత జ్ఞాపకాన్ని పంచుకుంది. జులన్ స్ఫూర్తితోనే తాను పేసర్‌గా ఎదిగినట్లు ఈ పాక్ క్రీడాకారిణి చెప్పింది.
‘2005లో పాకిస్తాన్‌లో జరిగిన ఆసియా కప్‌లో తొలిసారి భారత్ పాల్గొంది. ఆ టోర్నీలో నేను బాల్ గర్ల్‌గా పని చేశాను. ఆ సమయంలో ప్రపంచంలో ఫాస్టెస్ట్ బౌలర్‌గా ఉన్న జులన్ గోస్వామిని చూశాను. ఆమె బౌలింగ్ నన్ను ఎంతగా ఆకట్టుకుందంటే క్రికెట్‌నే కెరీర్‌గా మార్చుకోవాలని, అదీ ఫాస్ట్ బౌలర్‌ను కావాలని ఆ రోజే నిర్ణయించుకున్నాను. నాకు స్ఫూర్తిగా నిలిచిన క్రీడాకారిణితో కలిసి ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ ఆడుతున్నాను. ఇది నాకు మరింత స్ఫూర్తినిచ్చే అంశం’ అని కైనత్ వెల్లడించడం విశేషం.
ఫుట్‌బాల్ జట్టుకు కూడా..
వరల్డ్ కప్‌లో ఆడుతున్న పాక్ జట్టులో మరో పేసర్ దియానా బేగ్‌ది కూడా ఆసక్తికర నేపథ్యం. మొత్తం టోర్నీలోనే అత్యుత్తమ ఫీల్డర్‌గా ఆమె గుర్తింపు తెచ్చుకుంది. 21 ఏళ్ల దియానా గత ఏడాది వరకు పాకిస్తాన్ జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించింది. జట్టు తరఫున డిఫెండర్‌గా ఆమె బరిలోకి దిగింది. అయితే చివరకు రెండు ఆటల్లో ఒకదానిని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఆమె క్రికెట్ వైపు మొగ్గింది. భారత్‌లో మ్యాచ్‌లో కీలకమైన స్మృతి మంధన వికెట్ తీసినప్పుడు ఆమె బంతి వేగానికి బిషప్‌లాంటి కామెంటేటర్లు కూడా ఆశ్చర్యపోయారు.
పాయింట్ వద్ద దియానా మెరుపు ఫీల్డింగ్‌కు కారణం ఆమె ఫుట్‌బాల్ నైపుణ్యమేనని సహచరులు చెబుతారు. జాంటీ రోడ్స్ వీడియోలు ఆమె ఫీల్డింగ్ మెరుగుపడేందుకు స్ఫూర్తిగా నిలిచాయి. ‘నాకైతే అన్ని ఆటలూ ఇష్టమే. వీరంతా అడ్డుకుంటున్నారు గానీ లేదంటే వాలీబాల్, అథ్లెటిక్స్ కూడా ఆడేసేదాన్ని’ అని 21 ఏళ్ల దియానా తన ఆసక్తి గురించి నవ్వుతూ చెబుతోంది.