కరాచీ: ఆసియాకప్ హక్కులను వదిలేసుకోవడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) సిద్ధమైంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత క్రికెట్ జట్టు పాల్గొనడానికి సిద్ధంగా లేని క్రమంలో తాము ఏకంగా హక్కులనే వదిలేసుకోవడానికి కూడా వెనుకాడబోమని పీసీబీ చైర్మన్ ఇహసాన్ మణి తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆసియా కప్ జరగాల్సి ఉంది. దీని హక్కులను పాకిస్తాన దక్కించుకోగా, భారత్ మాత్రం అక్కడికి తమ జట్టును పంపమని ఇది వరకే తేల్చిచెప్పింది. అయినప్పటికీ భారత్ నిర్ణయం కోసం వేచిచూస్తామని పీసీబీ గతంలో స్పష్టం చేసినా, ఇప్పుడు మాత్రం చేతులెత్తేసినట్లే కనబడుతోంది. భారత క్రికెట్ జట్టు ఆసియా కప్‌లో ఆడకపోతే తాము ఆ నిర్వహణ హక్కులను వదులుకుంటామని మణి తెలిపారు. దీనిపై మార్చి నెలలో జరుగనున్న ఆసియన్ క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మణి వ్యాఖ్యలను ఈ టోర్నీని ఎక్కడ నిర్వహించాలనే దానిపై చర్చించనున్నారు. (ఇక్కడ చదవండి: అబ్దుల్ రజాక్‌ను ‘అమ్మ’ను చేసేశాడు..!)
‘అసోసియేట్ సభ్యుల ఆదాయాలు ప్రభావితం కాకుండా చూసుకోవాలి. ఇది ఐసీసీ పూర్తి సభ్యత్వం ఉన్న దేశాల గురించి కాదు.. ఇక్కడ అసోసియేట్ సభ్యత్వం కల్గిన దేశాల గురించి కూడా ఆలోచించాలి. అవసరమైతే మేము ఆసియా కప్ హక్కులను సైతం వదులకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం’ అని పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్)ను తాజా సీజన్‌లో ట్రోఫీని ఆవిష్కరించిన క‍్రమంలో మణి ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆసియా కప్‌లో భారత్ ఆడితే అది పాకిస్తాన్ వేదిక మీద ఉండదని విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. భారత్ లేకుండా పాక్‌లో ఆసియా కప్ జరిగితే అదొక భిన్నమైన గేమ్‌గా ఉంటుంది, ఒకవేళ భారత్ ఆడాలనుకుంటే మాత్రం తాము ఆడే మ్యాచ్‌లు వేదిక మాత్రం పాకిస్తాన్‌లో ఉండదన్నారు.
ఆసియా కప్‌పై పాకిస్తాన్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ టోర్నీలో భారత్ పాల్గొంటేనే విజయవంతం అవుతుందని పీసీబీ భావించింది. భారత్ మద్దతు లేకండా ఈ టోర్నీ విజయవంతం కాదని పీసీబీ సీఈఓ వసీం ఖాన్ గతంలోనే అభిప్రాయపడ్డాడు. ఆసియా కప్‌లో భారత్ ఆడాలని ఆకాంక్షించాడు. అయితే ఆసియా కప్ భారత్‌లో నిర్వహించినా పాక్ రావడానికి సిద్దంగా ఉందన్నాడు. అంతిమంగా ఈ మెగా టోర్నీలో భారత్ ఆడాలన్నదే తమ ఆశ అని వసీం ఖాన్ పేర్కొన్నాడు. అయితే ఆసియన్ క్రికెట్ కౌన్సిల్, ఐసీసీలదే తుది నిర్ణయమని స్పష్టం చేశాడు. తటస్థ వేదకల్లోనైనా భారత్‌తో పాక్ ఆడాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. 26/11 దాడుల తర్వాత పాక్‌తో ద్వైపాకిక్ష సిరీస్‌లను భారత్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. దాంతో పాకిస్తాన్‌తో తటస్థ వేదికలపై ఐసీసీ నిర్వహించే టోర్నీల్లో మాత్రమే భారత్ పాల్గొంటుంది.
Comments
Please login to add a commentAdd a comment