ఆసియా కప్-2023 వేదిక వివాదం, తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నజమ్ సేథీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్పోర్ట్స్ తక్ చానల్‌తో ఆయన మాట్లాడుతూ.. వన్డే వరల్డ్‌కప్-2023 కోసం తమ జట్టు భారత్‌లో అడుగుపెట్టేందుకు పాక్ ప్రభుత్వం ఒప్పుకోదని అన్నాడు. పాక్ ఆడాల్సిన మ్యాచ్‌లు తటస్థ వేదికలపై నిర్వహిస్తేనే తాము వరల్డ్‌కప్ ఆడతామని, లేదంటే లేదని తెగేసి చెప్పాడు. భారత్-పాక్ జట్ల మధ్య వరల్డ్‌కప్ మ్యాచ్ అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగనుందన్న ప్రచారం నేపథ్యంలో పీసీబీ ఈ రకంగా స్పందించింది.
కాగా, భారత్-పాక్‌ల మధ్య ఈ క్రికెట్ వివాదం ఆసియా కప్ వేదిక మార్పు నేపథ్యంలో మొదలైంది. భద్రతా కారణాల దృష్ట్యా పాక్‌లో ఆసియా కప్-2023 జరిగితే తాము ఎట్టి పరిస్థితుల్లో పాల్గొనేది లేదని బీసీసీఐ తెగేసి చెప్పింది. దీంతో పీసీబీ వెనక్కు తగ్గింది. తటస్థ వేదికపై (యూఏఈ) భారత్ ఆడాల్సిన మ్యాచ్‌లు నిర్వహించే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. దీనికి బీసీసీఐ సైతం అంగీకారం తెలిపింది. దీంతో మెగా టోర్నీ సజావుగా సాగుతుందని అంతా అనుకున్నారు. అయితే ఆసియా కప్ జరిగే సెప్టెంబర్ మాసంలో యూఏఈలో ఎండలు అధికంగా ఉంటాయన్న విషయాన్ని సాకుగా చూపుతూ, శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాలు యూఏఈ ప్రతిపాదనకు ససేమిరా అంటున్నాయి. దీంతో టోర్నీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.
దీంతో రంగంలోకి దిగిన ఏసీసీ.. యూఏఈ, పాక్‌లలో కాకుండా టోర్నీ మొత్తాన్ని శ్రీలంకలో నిర్వహించే మధ్యేమార్గ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. అయితే ఈ ప్రతిపాదనకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ససేమిరా అంటుంది. భారత్ ఆడే మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించేందుకు తాము అంగీకరించినప్పుడు.. కొత్తగా శ్రీలంక, బంగ్లాదేశ్‌లు అనవసర లొల్లి చేయడం సరికాదని అంటుంది. గతంలో ఐపీఎల్, ఆసియా కప్ టీ20 టోర్నీలు ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో యూఏఈలో జరిగిన విషయాన్ని గుర్తు చేస్తుంది. ఒకవేళ కాదు కూడదని టోర్నీని శ్రీలంకలోనే నిర్వహిస్తామంటే తాము వైదొలుగుతామని బెదిరింపులకు దిగుతుంది.
ఆసియా కప్ వేదికను పాక్ నుంచి శ్రీలంక మార్చాలని ఏసీసీ యోచిస్తున్న తరుణంలో పాక్ అవకాశవాద రాజకీయానికి తెర లేపింది. ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో తమ మ్యాచ్‌లు తటస్థ వేదికపై నిర్వహిస్తేనే టోర్నీలో పాల్గొంటామని, లేదంటే లేదని అంటుంది. బీసీసీఐ కోరినట్లు టీమిండియా మ్యాచ్‌లు తటస్థ వేదికపై నిర్వహించేందుకు తాము ఒప్పుకున్నప్పుడు.. బీసీసీఐ కూడా తమ మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహించేందుకు ఒప్పుకోవాలని డిమాండ్ చేస్తుంది. ఈ విషయంలో ఐసీసీ జోక్యం చేసుకోవాలని, లేదంటే తాము వరల్డ్‌కప్‌లో పాల్గొనేదే లేదని తెగేసి చెప్పింది.
చదవండి: టీమిండియా క్రికెటర్లేమైనా ఏలియన్సా..? నోరు పారేసుకున్న పాక్ ఫాస్ట్ బౌలర్
Comments
Please login to add a commentAdd a comment