ఆసియాకప్ 2023 నిర్వహణపై ఇంకా సందిగ్థత వీడడం లేదు. వాస్తవానికి ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆసియా కప్ జరగాల్సి ఉంది. ఐపీఎల్ 2023 ఫైనల్ తర్వాత ఆసియా కప్ నిర్వహణపై ఒక నిర్ణయం తీసుకుంటామని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ఐపీఎల్ ఫైనల్ అనంతరం నిర్వహించిన మీటింగ్‌లో ఆసియాకప్ వేదికను పాకిస్తాన్ నుంచి శ్రీలంకకు మార్చినట్లు వార్తలు వస్తున్నాయి.
పాకిస్తాన్‌లో ఆసియా కప్ ఆడేందుకు బీసీసీఐ నిరాకరించింది. దీంతో పీసీబీ హైబ్రిడ్ మోడ్‌లో ఆసియా కప్ నిర్వహించేందుకు ప్రణాళిక పంపింది. అయితే ఈ ప్రపోజల్‌ను మీటింగ్‌లో శ్రీలంక సహా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఆసియా కప్‌ను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు ఏసీసీకి తెలిపింది. దీనికి బీసీసీఐ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. దీంతో ఆసియాకప్ శ్రీలంకలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇది జరిగితే మాత్రం ఆసియా కప్‌లో పాక్ ఆడేందుకు నిరాకరించే అవకాశం ఉంది. అంతేకాదు ఆసియా కప్ నిర్వహణకు అడ్డుపడుతూ తమవద్ద నుంచి బలవంతంగా తరలించే ప్రయత్నం చేస్తున్నందుకు పీసీబీ ఐసీసీకి ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంది.దీంతో ఆసియా కప్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. అసలు జరుగుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ బుధవారం మరొకసారి సమావేశం కానుంది. ఈ మీటింగ్‌లో చర్చించి ఆసియా కప్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతిపాదన హైబ్రిడ్ మోడల్ రెండు రకాలు ఉన్నాయి. మొదటి ప్రతిపాదన ఏంటంటే ఆసియా కప్ టోర్నమెంట్ పాకిస్థాన్‌లో నిర్వహించబడుతుంది.. అయితే భారత జట్టు తటస్థ వేదికలో వారితో ఆడవచ్చు. ఇక రెండవ ప్రతిపాదన ఆసియా కప్ టోర్నీని రెండు భాగాలుగా విభజించనున్నారు. తొలి రౌండ్ మ్యాచ్‌లకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుండగా... ఈ రౌండ్‌లో భారత్‌తో మ్యాచ్‌లు ఉండవు. నిజానికి రెండో రౌండ్‌లో వారితో భారత జట్టు ఆడుతుంది. అలాగే టోర్నీ ఫైనల్ మ్యాచ్ తటస్థ వేదికపై జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment