క్రికెట్ కోచ్ ను మార్చండి!
కరాచీ: గత కొంతకాలంగా పేలవంగా సాగుతున్న పాకిస్థాన్ క్రికెట్ మరింత దిగజారిపోకుండా ఉండాలంటే దేశీయ కోచ్ లను కచ్చితంగా వదిలి పెట్టాల్సిన అవసరం ఉందని ఆ దేశ మాజీ ఆటగాడు మహ్మద్ యూసఫ్ స్పష్టం చేశాడు. ఆటగాళ్ల ప్రదర్శన మెరుగుపడటంతో పాటు, జట్టు కూడా పూర్తి స్థాయిలో ముందడుగు వేయాలంటే విదేశీ కోచ్ తోనే సాధ్యమవుతుందన్నాడు. ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ లో పాకిస్థాన్ ఘోరంగా విఫలమైన నేపథ్యంలో యూసఫ్ స్పందించాడు.
వన్డేల్లో, ట్వంటీ 20 ల్లో పాకిస్థాన్ క్రికెట్ పరిస్థితి అంతకంతకూ కిందికి పడిపోతుందంటూ యూసఫ్ ఆందోళన వ్యక్తం చేశాడు. రాబోయే సంవత్సరం అంతా కూడా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాల్లో పాకిస్థాన్ కు బిజీ షెడ్యూల్ ఉన్న తరుణంలో విదేశీ కోచ్ పై దృష్టి పెట్టాలని పీసీబీకి సూచించాడు. ఒకవేళ అలా జరగని పక్షంలో పాకిస్థాన్ మరోసారి చేదు అనుభవాన్ని ఎదుర్కొనక తప్పదని హెచ్చరించాడు. కాగా, ఎటువంటి విదేశీ కోచ్ ను తీసుకోవాలో అనే దానిపై కూడా యూసఫ్ స్పష్టతనిచ్చాడు. డేవ్ వాట్ మోర్, జెఫ్ లాసన్ వంటి కోచ్ లు కంటే గతంలో పాకిస్థాన్ కు పని చేసిన దివంగత కోచ్ బాబ్ వూమర్ తరహా కోచ్ లైతే మేలని సూచించాడు. పాకిస్థాన్ క్రికెట్ ను వూమర్ ఎంతగానో మెరుగుపరిచాడని ఈ సందర్భంగా యూసఫ్ కొనియాడాడు. ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ కోచ్ గా వకార్ యూనస్ పని చేస్తున్న సంగతి తెలిసిందే.