' ఆ టూర్ మా బ్యాట్స్మెన్కు సవాల్'
కరాచీ: వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న తమ జట్టుకు అక్కడ జరిగే టెస్టు సిరీస్ కచ్చితంగా పెద్ద పరీక్షగా నిలుస్తుందని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసుఫ్ పేర్కొన్నాడు. ప్రత్యేకంగా తమ బ్యాట్స్మెన్కు ఇంగ్లండ్ టూర్ ఒక సవాల్ అని స్పష్టం చేశాడు. ఇటీవల యూఏఈలో మాత్రమే ఆడుతున్న పాకిస్తాన్కు ఇంగ్లండ్లో పరిస్థితులకు అలవాటు పడటం అంత తేలిక కాదన్నాడు.
యూఏఈలోని పిచ్లకు, పాక్ పిచ్లకు పెద్దగా వ్యత్యాసం లేకపోయినా, ఇంగ్లండ్ వాతావారణం మాత్రం అందుకు భిన్నంగా ఉంటుందని యూసుఫ్ అభిప్రాయపడ్డాడు. టెస్టుల్లో మంచి రికార్డు కల్గిన ఇంగ్లండ్ను వారి దేశంలో నిలువరించడం పాక్కు అంత సులువు కాదని తెలిపాడు. గత కొంత కాలం నుంచి యూఏఈ లో ఆడటానికి మాత్రమే పాక్ పరిమితం కావడం ఆందోళన కల్గిస్తుందన్నాడు.