కరాచీ: కరోనా బాధితులను ఆదుకునేందుకు మరో క్రికెటర్ ముందుకొచ్చాడు. ఈసారి పాకిస్తాన్ టెస్టు జట్టు కెప్టెన్ అజహర్ అలీ తనకు చిరస్మరణీయమైన బ్యాట్, జెర్సీలను వేలానికి ఉంచాడు. 2016లో వెస్టిండీస్‌పై ట్రిపుల్ సెంచరీ (302) చేసిన బ్యాట్‌తో పాటు, భారత్‌తో జరిగిన 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ధరించిన జెర్సీని అజహర్ పాకిస్తాన్ కరెన్సీలో పది లక్షల రూపాయల (భారత కరెన్సీలో రూ. 4 లక్షల 73 వేలు) చొప్పున కనీస ధరకు అమ్మకానికి పెట్టాడు. దీంతో భారత్‌కు చెందిన ‘బ్లేడ్స్ ఆఫ్ గ్లోరీ’ క్రికెట్ మ్యూజియం (పుణే) బ్యాట్‌ను కనీస ధరకే దక్కించుకోగా... కాలిఫోర్నియాలో స్థిరపడ్డ పాకిస్తానీ కాశ్ విలానీ జెర్సీని పాకిస్తాన్ కరెన్సీలో 11 లక్షల రూపాయలకు (భారత కరెన్సీలో రూ. 5 లక్షల 20 వేలు) చేజిక్కించుకున్నాడు. న్యూజెర్సీలో స్థిరపడిన జమాల్ ఖాన్ లక్ష రూపాయల (భారత కరెన్సీలో రూ. 43 వేలు) విరాళం ఇచ్చాడు. దీంతో వేలం ద్వారా లభించిన మొత్తాన్ని కరోనా బాధితుల కోసం ఇవ్వనున్నట్లు అజహర్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment