
కరాచీ: పాక్ గడ్డపై టెస్టు క్రికెట్ తిరిగొచ్చిన ఆనందంలో ఉన్న ఆ దేశానికి సిరీస్ విజయం బోనస్ అయింది. దశాబ్దం తర్వాత సొంతగడ్డపై జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో పాకిస్తాన్ 1–0తో గెలిచింది. ఆఖరి టెస్టులో పాకిస్తాన్ 263 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. చివరి రోజు సోమవారం ఆట మొదలైన 14 నిమిషాలకే... 16 బంతుల్లోనే ముగిసింది. 476 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు 212/7 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్ అదే స్కోరు వద్ద ముగిసింది.
ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్, ఓపెనర్ ఫెర్నాండో (102)ను యాసిర్ షా ఔట్ చేయగా, లసిత్ ఎంబుల్దెనియా (0), విశ్వఫెర్నాండో (0)లను టీనేజ్ పేసర్ నసీమ్ షా (5/31) పెవిలియన్ బాట పట్టించాడు. మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన రెండో అతిపిన్న బౌలర్‌గా 16 ఏళ్ల 307 రోజుల వయసున్న నసీమ్ షా రికార్డులకెక్కాడు. తొలి బౌలర్ కూడా పాకిస్తానీ ఆటగాడే. 1958లో వెస్టిండీస్‌పై స్పిన్నర్ నజీమ్ ఉల్ ఘని (16 ఏళ్ల 303 రోజులు) ఈ రికార్డు సృష్టించాడు.
పాక్ భద్రమే: లంక సారథి
పాకిస్తాన్‌పై అభద్రతా భావం తగదని, ఇప్పుడు పాక్ 200 శాతం భద్రమైన దేశమని శ్రీలంక సారథి కరుణరత్నే తెలిపాడు. ఈ దేశంలో పర్యటన ఇపుడు సురక్షితమైందేనని చెప్పాడు. ‘ప్రభుత్వం చేపట్టిన భద్రతా చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయి. పర్యటనకు ముందు పాక్‌లో బయటికెళ్లడంపై ఆందోళనగా ఉండేది. కానీ వచ్చాక మాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు’ అని కరుణరత్నే అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment