
ఇంకా ఏం సాధించాలి?
వరుసగా రెండో ఏడాదీ తనకు పద్మభూషణ్ పురస్కారం దక్కకపోవడంపై భారత స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. 16 సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తన ఘనత కేంద్రానికి ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించాడు. ఇంకా ఏం సాధిస్తే ఈ పురస్కారం దక్కుతుందో అర్థం కావడం లేదని ఆవేదన వెలిబుచ్చాడు. అద్వానీ పేరును మూడో అత్యున్నత పౌర పురస్కారానికి కర్ణాటక, భారత బిలియర్డ్స్ అండ్ స్నూకర్ సమాఖ్య (బీఎస్‌ఎఫ్‌ఐ) కేంద్రానికి ప్రతిపాదించాయి.
అయితే ఈ ఏడాది ఏ ఆటగాడికీ పద్మభూషణ్ దక్కలేదు. దీంతో అద్వానీ తీవ్రంగా స్పందిస్తూ క్రీడల శాఖా మంత్రికి ట్వీట్ చేశారు. మరో వైపు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల కూడా తనకు అవార్డు లభించకపోవడంపై విమర్శలు చేసింది. అవార్డులు కావాలంటే సిఫారసులు చేసుకోవాలని, లేదంటే దక్కవన్న జ్వాల... దరఖాస్తు చేసుకునే ప్రక్రియనే ప్రశ్నించింది.