భారత ‘క్యూ’స్పోర్ట్ కింగ్ పంకజ్ అద్వానీ మళ్లీ ప్రపంచ రారాజు అయ్యాడు. అంతర్జాతీయ బిలియర్డ్స్, స్నూకర్‌లో ఏ ఫార్మాట్ ఎదురైనా తను మాత్రమే చాంపియన్ అని మరోసారి ఘనంగా చాటాడు. అద్భుతమైన ప్రదర్శనతో కెరీర్‌లో 22వ ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గాడు. అతని జోరు చూస్తుంటే టైటిళ్ల రజతోత్సవం (25) జరుపుకున్నా ఆశ్చర్యం లేదు.
మండాలే (మయన్మార్): క్యూ స్పోర్ట్స్‌కే వన్నె తెచ్చిన భారత చాంపియన్ ఆటగాడు పంకజ్ అద్వానీ మళ్లీ విశ్వవిజేతగా నిలిచాడు. అంతర్జాతీయ బిలియర్డ్స్, స్నూకర్ సమాఖ్య (ఐబీఎస్‌ఎఫ్) ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ లో పంకజ్ గెలుపొందాడు. తాజాగా 150–అప్ ఫార్మాట్‌లో టైటిల్ సాధించాడు. అతని కెరీర్‌లో ఇది 22వ ఐబీఎస్‌ఎఫ్ ప్రపంచ టైటిల్ కావడం విశేషం. 150–అప్ అనేది బిలియర్డ్స్‌లో పొట్టి ఫార్మాట్ కాగా... ఇందులో గత ఆరేళ్లలో పంకజ్ అద్వానీ ఐదు టైటిల్స్ సాధించాడు. ఆదివారం జరిగిన పోరులో 6–2 ఫ్రేమ్‌లతో స్థానిక మయన్మార్ ఆటగాడు నే త్వే వూపై విజయం సాధించాడు. గతేడాది జరిగిన ఫైనల్లోనూ వీళ్లిద్దరే తలపడ్డారు. ఆదివారం గత ఫైనల్‌కు రిపీట్‌గా జరిగిన పోరులో చిత్రంగా అదే ఫ్రేమ్‌ల (6–2) తేడాతో పంకజ్ గెలుపొందడం విశేషం.
మ్యాచ్ అర్ధభాగం ముగిసేసరికి 145–4, 89–66, 127–50 స్కోరుతో 3–0 ఫ్రేమ్‌లతో పంకజ్ జోరుమీదుండగా... ప్రత్యర్థి తేరుకోలేకపోయాడు. విరామానంతరం కూడా అద్వానీ 63–0, 62–50 స్కోరుతో దూసుకెళ్లడంతో నే త్వే వూ ప్రేక్షకుడిగా మిగిలిపోయాడు. చివరకు 50–69, 64–105తో ప్రత్యర్థి రెండు ఫ్రేమ్‌లు గెలిచాడు. ఆఖరి ఫ్రేమ్‌ను 74–63తో గెలవడంతో పంకజ్ ప్రపంచ విజేతగా నిలిచాడు. 2003లో తొలిసారి చాంపియన్‌షిప్ అందుకున్న అద్వానీ తదనంతరం టైమ్ ఫార్మాట్‌లో 8 సార్లు, పాయింట్స్ ఫార్మాట్‌లో 6 సార్లు ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్స్ సాధించాడు. స్నూకర్‌లో ఐదుసార్లు విజేతగా నిలిచిన భారత క్యూ స్టార్ ప్రపంచ టీమ్ బిలియర్డ్స్, టీమ్ స్నూకర్‌లో ఒక్కోసారి విజయం సాధించాడు. ‘ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ప్రతీసారి నాకో విషయం స్పష్టంగా అర్థమైంది. ఈ మెగా టోరీ్నలో రాణించాలనే కసి పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. అందువల్లే ఆటలో నా దూకుడు, టైటిళ్ల ఆకలి కొనసాగుతూ ఉంది’ అని పంకజ్ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment