రసూల్ సెంచరీ
వడోదర: జమ్మూ కాశ్మీర్ ఆల్‌రౌండర్, కెప్టెన్ పర్వేజ్ రసూల్ రంజీ ట్రోఫీలో తన బ్యాటింగ్ ఫామ్‌ను కొనసాగించాడు. ఈ సీజన్‌లో జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన అతను క్వార్టర్ ఫైనల్లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్‌తో ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో రసూల్ (137 బంతుల్లో 103; 11 ఫోర్లు, 1 సిక్స్) శతకంతో రాణించి తన జట్టును మెరుగైన స్థితికి చేర్చాడు. రసూల్‌తో పాటు ఆదిల్ రిషి (108 బంతుల్లో 65; 9 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడటంతో మ్యాచ్ రెండో రోజు గురువారం జమ్మూ కాశ్మీర్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 277 పరుగులకు ఆలౌటైంది.
ఫలితంగా ఆ జట్టు పంజాబ్‌కు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే కోల్పోయింది. రసూల్ నాలుగో వికెట్‌కు ఆదిల్‌తో 81 పరుగులు, సమీయుల్లా బేగ్ (37)తో ఏడో వికెట్‌కు 86 పరుగులు జోడించడం విశేషం. సందీప్ శర్మకు 4 వికెట్లు దక్కాయి. అనంతరం కాశ్మీర్ బౌలర్లు కట్టడి చేయడంతో పంజాబ్ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. చేతిలో 8 వికెట్లు ఉన్న పంజాబ్ ప్రస్తుతం ఓవరాల్‌గా 42 పరుగుల ఆధిక్యంలో ఉంది.
మహేశ్ రావత్ శతకం
కోల్‌కతా: బెంగాల్‌తో జరుగుతున్న మరో క్వార్టర్స్‌లో రైల్వేస్ జట్టు ఆధిక్యం దిశగా వెళుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. మహేశ్ రావత్ (125 బంతుల్లో 105 బ్యాటింగ్; 18 ఫోర్లు, 1 సిక్స్), ఆరిందమ్ ఘోష్ (167 బంతుల్లో 78 బ్యాటింగ్; 11 ఫోర్లు) ఆరో వికెట్‌కు ఇప్పటికే అభేద్యంగా 191 పరుగులు జత చేయడం విశేషం.
దిండా (3/83), శివ్ పాల్ (2/36) ధాటికి రైల్వేస్ ఒక దశలో 42 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే రావత్, ఘోష్ జోడి జట్టును ఆదుకుంది. ప్రస్తుతం మరో 84 పరుగులు వెనుకబడి ఉన్న రైల్వేస్ చేతిలో 5 వికెట్లు ఉండటంతో ఆధిక్యం సాధించే అవకాశం కనిపిస్తోంది. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 274/8 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన బెంగాల్ మరో 43 పరుగులు జోడించి 317 పరుగులకు ఆలౌటైంది.
ఉత్తరప్రదేశ్ వెనుకంజ
బెంగళూరు: కర్ణాటకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సరికి ఆ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.
పర్వీందర్ సింగ్ (181 బంతుల్లో 92; 13 ఫోర్లు) సెంచరీ అవకాశం కోల్పోగా, పీయూష్ చావ్లా (99 బంతుల్లో 56; 5 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 110 పరుగులు జోడించడంతో యూపీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మరో వికెట్ మాత్రమే చేతిలో ఉన్న యూపీ ప్రస్తుతం 128 పరుగులు వెనుకబడి ఉంది. అంతకు ముందు ఓవర్ నైట్ స్కోరు 297/5తో రెండో రోజు ఆట ప్రారంభించిన కర్ణాటక తమ తొలి ఇన్నింగ్స్‌లో 349 పరుగులకు ఆలౌటైంది. సీఎం గౌతమ్ (100) సెంచరీ పూర్తి చేసుకోవడం గురువారం ఆటలో విశేషం.
భారీ ఆధిక్యం దిశగా ముంబై
ముంబై: మహారాష్ట్రతో వాంఖడే మైదానంలో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబైకి భారీ ఆధిక్యం దక్కే అవకాశం ఉంది. గురువారం ఆట ముగిసే సరికి మహారాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.
అంకిత్ బానే (113 బంతుల్లో 84; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), కేదార్ జాదవ్ (66 బంతుల్లో 51; 9 ఫోర్లు) నాలుగో వికెట్‌కు 115 పరుగులు జత చేసి జట్టును ఆదుకున్నారు. ముంబై బౌలర్ షార్దుల్ ఠాకూర్ (4/62) ఆకట్టుకున్నాడు. యువ ఆటగాడు విజయ్ జోల్ (15) వికెట్‌ను మాత్రం జహీర్ ఖాన్ పడగొట్టగలిగాడు. అంతకు ముందు ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులకు ఆలౌటైంది. చివర్లో ఇక్బాల్ అబ్దుల్లా (49 నాటౌట్), జహీర్ ఖాన్ (39) ఎనిమిదో వికెట్‌కు 62 పరుగులు జత చేయడం విశేషం. ప్రస్తుతం 3 వికెట్లు మాత్రమే చేతిలో ఉన్న మహారాష్ట్ర మరో 183 పరుగులు వెనుకబడి ఉండటంతో ముంబై భారీ ఆధిక్యం దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.